వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్‌లో కాదు. ప్రపంచకప్‌లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.
వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.
అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్‌నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది.
Comments
Please login to add a commentAdd a comment