
కర్ణాటక జట్టు
న్యూఢిల్లీ: టెస్టు ఫార్మాట్ రంజీ ట్రోఫీలో, టి20 టోర్నీ ముస్తాక్ అలీలో చక్కగా ఆడినా అదృష్టం కలిసిరాక టైటిల్ గెలవలేకపోయిన కర్ణాటక... వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని మాత్రం ఒడిసిపట్టింది. తద్వారా ఈ సీజన్‌లో తమ అత్యద్భుత ఆటకు సరైన ముగింపునిచ్చింది. మంగళవారం సౌరాష్ట్రతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (79 బంతుల్లో 90; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు, సమర్థ్ (65 బంతుల్లో 48; 1 ఫోర్, 1 సిక్స్); దేశ్‌పాండే (60 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో కమలేశ్ మక్వానా (4/34); ప్రేరక్ మన్కడ్ (2/54) ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో కెప్టెన్ చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 94; 10 ఫోర్లు, 1 సిక్స్) మినహా మరెవరూ నిలవకపోవడంతో సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లు ప్రసిధ్ కృష్ణ (3/37), కృష్ణప్ప గౌతమ్ (3/27) రాణించారు. మయాంక్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
అతడే ఆడాడు...
ఐదు పరుగులకే కెప్టెన్ కరుణ్ నాయర్ (0), కేఎల్ రాహుల్ (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన కర్ణాటకను మయాంక్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సమర్థ్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. కుదురుకున్నాక బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. శతకం చేసే ఊపులో కనిపించిన అతడు... ధర్మేంద్ర బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. కొద్దిసేపటికే సమర్థ్ కూడా వెనుదిరిగినా పవన్ దేశ్‌పాండే, శ్రేయస్ గోపాల్ (28 బంతుల్లో 31; 6 ఫోర్లు) విలువైన పరుగులు జోడించారు. అనంతరం పేసర్ ప్రసిద్ధ్ ధాటికి సౌరాష్ట్ర 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కీపర్ బరోట్ (30) అండతో పుజారా అడ్డుగోడలా నిలిచాడు. టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా (15) సహా మన్కడ్ (0), వసవాదా (0), ఉనాద్కట్ (0)ల వైఫల్యంతో సౌరాష్ట్ర కోలుకోలేకపోయింది. జట్టు స్కోరు 200 వద్ద పుజారా రనౌట్‌గా వెనుదిరగడంతో పరాజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక లెఫ్టార్మ్ పేసర్, 33 ఏళ్ల శ్రీనాథ్ అరవింద్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
మయాంక్ రికార్డు
విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మయాంక్ రికార్డు సృష్టించాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు 607 పరుగులతో (2016–17) దినేశ్ కార్తీక్ పేరిట ఉండేది. దేశవాళీ క్రికెట్ ఒకే సీజన్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ మయాంక్ (2,141 పరుగులు) గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (1,947 పరుగులు; 2015–16) పేరిట ఉండేది.