సాక్షి, హైదరాబాద్: వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నీ వర్షం బారిన పడింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడు మ్యాచుల్లో వర్షం కారణంగా రెండు అర్ధాంతరంగా రద్దయ్యాయి. మరో మ్యాచ్‌లో మాత్రం ఫలితం వచ్చింది. ఈసీఐఎల్ మైదానంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 38 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (63 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చైతన్య రెడ్డి (61 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (20 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), శశిధర్ రెడ్డి (32 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. తమిళనాడు బౌలర్లలో అలెగ్జాండర్ 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, కౌశిక్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తమిళనాడు మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. కె. ముకుంద్ (65 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. సీవీ మిలింద్ 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడం విశేషం.
రాణించిన అభిషేక్...
ఎన్‌ఎఫ్‌సీ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కర్ణాటక 32 పరుగుల తేడాతో (వీజేడీ పద్ధతిలో) కేరళపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేరళ 37 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. విష్ణు బాబు (40), అనూజ్ జతిన్ (33) రాణించారు. ప్రదీప్, ఉమంగ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం కర్ణాటక 20.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (57 నాటౌట్) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ దశలో వర్షం రావడంతో వీజేడీ ద్వారా విజేతను తేల్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర, గోవా జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా రద్దయింది. ముందుగా గోవా 28 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
కేరళపై కర్ణాటక గెలుపు
Published Thu, Oct 24 2013 12:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement