జయహో కేదర్ జాదవ్..
పుణె: ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపెట్టడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమకు ఇచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. మరోవైపు మరో్ యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ఆశిస్తున్న పలువురు వెటరన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్ ఇటీవల ఊహించని విధంగానే జట్టులోకి పునరాగమనం చేసి అతుక్కుపోయాడు.
2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన కేదర్ జాదవ్కు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.తొలుత వికెట్ కీపర్ బ్యాట్స్మన్ గా జాదవ్ సేవలందించాడు. దానిలో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కూడా. అయితే మారుతున్న పరిస్థుతుల దృష్ట్యా ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆఫ్ బ్రేక్ బౌలర్గా మారాడు.
ఇప్పుడు అదే ఆ క్రికెటర్ కు వరంలా మారింది. అటు బ్యాట్స్తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు జాదవ్. ఇప్పటివరకూ 13 వన్డేలు ఆడిన జాదవ్.. 9 ఇన్నింగ్స్ ల్లో ఆరు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన ఈ క్రికెటర్.. రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా, కీలకమైన మూడో వన్డేలో మూడు వికెట్లు తీసి కివీస్ టాపార్డర్కు షాకిచ్చాడు. న్యూజిలాండ్ 12.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న స్థితిలో కెప్టెన్ విలియమ్సన్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపడంతో వికెట్ల వేటను ఆరంభించిన కేదర్.. ఆ తరువాత రాస్ టేలర్, టామ్ లాధమ్లను అవుట్ చేసి అతనిలో బౌలింగ్ ప్రతిభను చాటుకున్నాడు.
అయితే ఆ తరువాత ప్రస్తుతం ఇంగ్లండ్ జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు పాటు బౌలింగ్ వేసిన జాదవ్ 23 పరుగులిచ్చాడు. కాగా, వికెట్లను సాధించడంలో మాత్రం విఫలమైనా బౌలింగ్ ఎకానమీ పరంగా ఆకట్టుకున్నాడు. అశ్విన్ లాంటి ఆఫ్ స్పిన్నరే 7.87 ఎకానమీ నమోదు చేస్తే, జాదవ్ మాత్రం 5.75 ఎకానమీ రేట్ తో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆ తరువాత 351 పరుగుల లక్ష్య ఛేదనలో తన వంతు పాత్రను జాదవ్ సమర్ధవంతంగా నిర్వర్తించాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇప్పటివరకూ తన కెరీర్ లో రెండో వన్డేలు సెంచరీ చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఒత్తిడి సమయంలో కేదర్ జాదవ్ చేసిన సెంచరీ అతని భవిష్యత్తుపై భరోసా కల్పించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లండ్ తో విజయంలో వంద శాతం న్యాయం చేసి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే కాలంలో టీమిండియా జట్టులో జాదవ్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశిద్దాం. జయహో కేదర్ జాదవ్.