
'కిక్' మొదలైంది !
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆదివారం ప్రారంభమైంది.
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆదివారం ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు వివేకానంద యువభారతి క్రిరంగన్ మైదానం (సాల్ట్‌లేక్ స్టేడియం)లో జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకాగా భారత క్రికెట్ ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఓవరాల్‌గా 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఆరంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్‌ను వీక్షించేందుకు 70 వేల మంది హాజరయ్యారు.
జట్టు పరిచయ కార్యక్రమాల్లో భాగంగా స్టేడియం మధ్యలోకి వచ్చిన సచిన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ నిలబడి చప్పట్లతో స్వాగతించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయా ఫ్రాంచైజీల యజమానులు సౌరవ్ గంగూలీ, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, జాన్ అబ్రహాం, పరిణీతి చోప్రా హాజరయ్యారు. అయితే ఏ లీగ్ అయినా ఆటగాళ్లే ప్రధాన ఆకర్షణగా నిలవాల్సి ఉన్నా ఇక్కడ మాత్రం యజమానులకే స్టార్ హోదా ఉండడంతో అందరి దృష్టీ వీరిపైనే నెలకొంది. ఆటగాళ్లు నామమాత్రంగా మిగలాల్సి వచ్చింది.
ఐఎస్‌ఎల్ ఆరంభ వేడుకలను ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. ఆమె వెంటే మైదానంలోకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఫుట్‌బాల్ ప్రపంచాన్ని జయించగలుగుతుంద’ని అన్నారు. అలాగే ఈ క్రీడను భారత్‌లోని మారుమూల ప్రాంతానికి సైతం తీసుకెళతామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం వేడుకల్లో భాగంగా 200 మంది బాలబాలికలు మెరిసే ఫుట్‌బాల్‌లను చేతపట్టుకుని ఐఎస్‌ఎల్ లోగోగా మారి అబ్బురపరిచారు. ఈ సమయంలో స్టేడియంలో బాణసంచా పెద్ద ఎత్తున కాల్చారు.
భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంగా భావించే 1951-61 మధ్య కాలంలో ఆడిన ఆటగాళ్లను కీర్తిస్తూ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు.
అనంతరం ఆయా జట్ల సంప్రదాయక సంగీత కార్యక్రమాలు జరిగాయి. మొదట కోల్‌కతా జట్టు తరఫున మ్యూజీషియన్ బిక్రమ్ ఘోష్ స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చెన్నైయిన్ ఎఫ్‌సీ నుంచి డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి తన ప్రతిభతో సమ్మోహనపరిచాడు. కేరళ బ్లాస్టర్ నుంచి మళయాల సంగీతకారుడు రోనీ రాఫెల్.. పుణే ఎఫ్‌సీ నుంచి గణపతి ఉత్సవాల్లో ప్రముఖంగా కనిపించే ధోల్ తాషాను ప్రదర్శించారు. ఢిల్లీ డైనమోస్ తరఫున పంజాబీ ఢోల్ సంగీతాన్ని హనీఫ్ అస్లాం దఫ్రానీ వినిపించారు.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా రంగప్రవేశంతో ఉత్సవాలు జోరందుకున్నాయి. హిందీ పాటలకు తనదైన శైలిలో నృత్యం చేస్తూ ప్రేక్షకులను హుషారెత్తించింది. సంగీత ద్వయం సలీం-సులేమాన్ కూడా తనతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
వేడుకల తర్వాత ఐఎస్‌ఎల్ ఫ్రాంచైజీల పరిచయ కార్యక్రమం ప్రియాంక చోప్రా ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కో జట్టు సహ యజమాని, తమ కోచ్ లేదా కెప్టెన్‌లతో కలిసి వేదికపైకి వచ్చారు. చివర్లో నీతా అంబానీ బెంగాలీలో మాట్లాడుతూ ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.