కొత్త చరిత్ర | Kidambi Srikanth, B Sai Praneeth to contest Singapore Open Superseries final | Sakshi
Sakshi News home page

కొత్త చరిత్ర

Published Sun, Apr 16 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

కొత్త చరిత్ర

కొత్త చరిత్ర

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌  టైటిల్‌ మనోళ్లకే ఖాయం
పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో  సాయిప్రణీత్, శ్రీకాంత్‌ అమీతుమీ
తొలిసారి ఇద్దరు భారత ఆటగాళ్ల  మధ్య ‘సూపర్‌’ తుది పోరు


ఇద్దరు తెలుగు తేజాలు భమిడిపాటి సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సింగపూర్‌లో శనివారం కొత్త చరిత్రను లిఖించారు. అంచనాలకు మించి రాణిస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమించిన సాయిప్రణీత్‌... పూర్వ వైభవాన్ని మళ్లీ సంపాదించాలనే పట్టుదలతో శ్రీకాంత్‌... సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అంతిమ సమరానికి సిద్ధమయ్యారు.

జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ శిష్యులైన వీరిద్దరూ ఫైనల్‌ చేరే క్రమంలో అద్వితీయ ఘనతను సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) 2007లో సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లు ప్రవేశపెట్టాక... ఒకే సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఫైనల్‌కు అర్హత పొందిన ఇద్దరు భారత క్రీడాకారులుగా వీరిద్దరూ గుర్తింపు పొందారు. చైనా, ఇండోనేసియా, డెన్మార్క్‌ దేశాల తర్వాత భారత్‌ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఓ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరుకున్నారు.  

మొత్తానికి సాయిప్రణీత్, శ్రీకాంత్‌ల మధ్య ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ తుది ఫలితం ఎలా ఉన్నా భారత్‌ ఖాతాలో టైటిల్‌ చేరడం మాత్రం ఖాయమైంది.

సింగపూర్‌ సిటీ: కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించేందుకు సాయిప్రణీత్‌... రెండేళ్ల తర్వాత మరో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచేందుకు శ్రీకాంత్‌... కేవలం ఒక్క విజయం దూరంలో ఉన్నారు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు నేడు (ఆదివారం) జరిగే టైటిల్‌ పోరులో తలపడనున్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21–6, 21–8తో ప్రపంచ 35వ ర్యాంకర్‌ లీ డాంగ్‌ కెయున్‌ (దక్షిణ కొరియా)పై... ప్రపంచ 29వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–13, 21–14తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ఆంథోనీ గిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై గెలుపొందారు.

సాయిప్రణీత్‌ కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌కాగా... శ్రీకాంత్‌కు మూడో సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌. గతంలో సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న రెండుసార్లూ శ్రీకాంత్‌ (2014లో చైనా ఓపెన్‌; 2015లో ఇండియా ఓపెన్‌) విజేతగా నిలిచాడు. అయితే సాయిప్రణీత్‌తో ముఖాముఖి రికార్డులో మాత్రం శ్రీకాంత్‌ 1–4తో వెనుకంజలో ఉండటం గమనార్హం. తాజాగా వీరిద్దరూ ఈ ఏడాది సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ సెమీఫైనల్లో ఆడగా... సాయిప్రణీత్‌ మూడు గేముల్లో గెలుపొందాడు. 2014లో సయ్యద్‌ మోదీ టోర్నీలోనే సాయిప్రణీత్‌పై శ్రీకాంత్‌ ఏకైకసారి విజయం సాధించాడు.

ఆద్యంతం ఆధిపత్యం...
సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌లు చొప్పున ఆడి చెమటోడ్చి గెలిచిన సాయిప్రణీత్‌... సెమీఫైనల్లో మాత్రం కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం జపాన్‌ ఓపెన్‌లో లీ డాంగ్‌ కెయున్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో వరుస గేముల్లో ఓడిపోయిన సాయిప్రణీత్‌ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నాడు. తొలి గేమ్‌లో సాయిప్రణీత్‌ వరుసగా 10 పాయింట్లు గెలిచి సంచలనమే సృష్టించాడు. ఆ తర్వాత లీ డాంగ్‌ ఖాతా తెరిచినా ఏ దశలోనూ సాయిప్రణీత్‌ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయాడు.

ముఖ్యంగా సాయిప్రణీత్‌ డ్రాప్‌ షాట్‌లకు, నెట్‌ వద్ద అప్రమత్తతకు లీ డాంగ్‌ పోటీనివ్వలేకపోయాడు. తొలి గేమ్‌ నెగ్గిన ఉత్సాహంలో రెండో గేమ్‌లోనూ సాయిప్రణీత్‌ జోరు కొనసాగించాడు. తొలుత రెండు పాయింట్లు గెలిచిన అతను, ఆ తర్వాత ఒక పాయింట్‌ కోల్పోయాడు. అనంతరం వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 9–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి సాయిప్రణీత్‌ వెనుదిరిగి చూడలేదు. రెండు గేముల్లోనూ ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాకపోవడం సాయిప్రణీత్‌ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.

తడబడి... తేరుకొని...
ఇండోనేసియా యువ సంచలనం ఆంథోని గిన్‌టింగ్‌తో జరిగిన సెమీఫైనల్లో శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడాడు. తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్‌ 4–9తో వెనుకబడ్డాడు. అయితే ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ తన ఆటలోని లోపాలను సరిదిద్దుకొని నిలకడగా పాయిం ట్లు సాధించాడు. స్కోరు 6–10 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్‌ నమ్మశక్యంకాని రీతిలో విజృం భించి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. కొన్ని సార్లు సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే, అదను చూసి కళ్లు చెదిరే స్మాష్‌లతో శ్రీకాంత్‌ అలరించాడు.

తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ రెండో గేమ్‌లో కూడా జాగ్రత్తగా ఆడాడు. గతంలో గిన్‌టింగ్‌ చేతిలో ఒకసారి ఓడిన అనుభవమున్న శ్రీకాంత్‌ తన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేదు. రెండో గేమ్‌ ఆరంభంలోనే 9–1తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ ఆ తర్వాత కాస్త ఒత్తిడికి లోనై కొన్ని వరుస పాయింట్లు కోల్పోయాడు. అయితే ఈ దశలో శ్రీకాంత్‌ మరిన్ని పొరపాట్లు చేయకుండా నిగ్రహంతో ఆడి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయంతోపాటు ఫైనల్లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.

 రెండేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్‌ ఆ తర్వాత గాయాల కారణంగా వెనుకబడ్డాడు. ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్‌ 18 టోర్నీల తర్వాత ఓ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరిగే ఐదు ఫైనల్స్‌ షెడ్యూల్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్‌ది మూడో మ్యాచ్‌గా ఉంది. తొలి రెండు ఫైనల్స్‌ ముగిశాక వీరిద్దరి ఫైనల్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం వీరిద్దరి మ్యాచ్‌ మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే అవకాశముంది.

నేటి ఫైనల్స్‌ 
ఉదయం గం. 10.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–4లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement