టైటిల్ పోరుకు శ్రీకాంత్ | Kidambi Srikanth reaches Indonesian Masters final | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు శ్రీకాంత్

Published Sun, Dec 6 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

టైటిల్ పోరుకు శ్రీకాంత్

టైటిల్ పోరుకు శ్రీకాంత్

మలాంగ్: వరుస వైఫల్యాల తర్వాత భారత నంబర్‌వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-13, 21-19తో ప్రపంచ 39వ ర్యాంకర్ జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)పై గెలిచాడు.  ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1-2తో వెనుకంజలో ఉన్నాడు.
 
 ఆంథోనీతో 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ నిలకడైన ఆటతీరును కనబరిచి ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత శ్రీకాంత్ ఫామ్ కోల్పోయాడు. బరిలోకి దిగిన 15 టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకున్న ఈ తెలుగు తేజం ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ ఏడాది ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీలో ఆంథోనీ చేతిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి పట్టుదలతో ఆడాడు.
 
  ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పట్టు బిగించాడు. తొలి గేమ్‌లో 7-2తో ముందంజ వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించాడు. స్కోరు 15-13 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో శ్రీకాంత్ 5-8తో వెనుకబడ్డాడు. ఈ దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా 11 పాయింట్లు సాధిం చాడు. 16-8తో ఆధిక్యం లోకి వెళ్లాడు. ఆంథోనీ కోలుకునే ప్రయత్నం చేసినా శ్రీకాంత్ సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement