కీరన్ పోలార్డ్ (ఫైల్ ఫొటో)
ముంబై : మ్యాచ్ గెలవడానికి ఓ ఉపాయం చెప్పండని ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మీడియాను కోరాడు. వరుస ఓటములతో చతికలిపడ్డ డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో సొంత మైదానం వాంఖడేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ విండీస్ ఆటగాడు మీడియాతో ముచ్చటించాడు.
‘‘ఆడిన మూడు మ్యాచుల్లో మేం చివరి ఓవర్లోనే ఓడిపోయాం. ఇలా మళ్లీ జరగకుండా ఓ ఉపాయం చెప్పండి. మీకు క్రికెట్ గురించి బాగా తెలుసు కాబట్టి చివర్లో ఏం చేయాలో మాకు ఓ సలహా ఇవ్వండి.’’ అని పొలార్డ్ పాత్రికేయులను కోరాడు. ఇంకా తమ జట్టు టైటిల్ రేసులో ఉందని తెలిపాడు. ‘‘ మేం దిగువ స్థాయిలో ఉన్నామని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలానుకుంటే మాత్రం.. మేం ఇంటికి వెళ్లాల్సిందే. మా పని అయిపోయినట్లే. గత రెండు మ్యాచుల్లో (సన్‌రైజర్స్, చెన్నైలపై) 9 వికెట్లు పడగొట్టాం. చివరి వికెట్ తీస్తే విజయం మాదే కానీ అదే ఎలాసాధించాలో మేం మెరుగు పరుచుకోవాలి. 190 పరుగుల లక్ష్య చేధన ఎవరికైనా కష్టమే. కానీ సాధ్యమైంది’’.
వ్యక్తిగత ప్రదర్శనపై.. ‘‘ నా ప్రదర్శన పట్ల చింతించడం లేదు. ప్రతి క్రికెటర్ సరిగా రాణించకపోతే ఇబ్బంది పడుతారు. కానీ నేను ఆడిన మూడు మ్యాచుల్లో ఒకదానిలో బ్యాటింగ్ రాలేదు. రెండో మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చా. మూడో గేమ్‌లో విఫలమయ్యాను. నేనెప్పుడు అద్భుతంగా రాణించాలనే ఆకలితో ఉన్న క్రికెటర్‌నే. ప్రతి క్రికెటర్‌కు అద్భుత ప్రదర్శన అవసరం. ఎంత పెద్ద జట్టైనా.. ఎంత పెద్ద ఆటగాళ్లున్నా నాకనవసరం. ఇక పొలార్డ్ టైం వచ్చింది. లెక్కపెట్టుకోండి’’ అని ఆర్సీబీతో జరిగే నేటి మ్యాచ్‌లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
విండీస్ ఆటగాళ్ల ప్రదర్శనపై స్పందిస్తూ.. ఐపీఎల్‌లో విండీస్ ఆటగాళ్లు రాణించండం సంతోషంగా ఉందని, గేల్ సునామీ ఇన్నింగ్స్ తనను ఆకట్టుకుందని పొలార్డ్ తెలిపాడు. ‘మీరు గేల్ గురించి ప్రస్తావించినప్పుడు.. అత్యధిక టీ20 పరుగులు, గొప్ప రికార్డులు, సిక్సుల గురించి మాట్లాడుతారు. కానీ అలాంటి గేల్‌ను ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చకపోవడం ఓ వెస్టిండియన్‌గా నాకు నిరాశను కలిగించింది. గేల్ ఆడిన తొలి గేమ్.. అతనెంటో తెలియజేసింది. చివరకు యూనివర్స్ బాస్‌గా అతను ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు.’ అని పొలార్డ్ అభిప్రయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment