ముంబై : ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ జూలు విదిల్చాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. ఈ ఆల్‌రౌండర్‌కు తోడుగా కృనాల్ పాండ్యా రాణించడంతో ముంబై, పంజాబ్‌కు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. అయితే ఆండ్రూ టై, ఓపెనర్ ఎవిన్ లూయిస్(9)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్.. దాటిగా ఆడాడు. దీంతో 5 ఓవర్లకు ముంబై 50 పరుగులు పూర్తి చేసింది. మరోసారి టై విజృంభించడంతో జోరు మీదున్న ఇషాన్ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్(27: 15 బంతుల్లో 3 ఫోర్, 2 సిక్స్‌లు)లు వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో ముంబై ఇండియన్స్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే రోహిత్ శర్మ(6) సైతం పెవిలియన్ చేరాడు.
ఆదుకున్న కృనాల్- పొలార్డ్
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన పోలార్డ్, కృనాల్ పాండ్యాలు ఆచితూచి ఆడుతూ.. ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్ బోర్డ్ పరుగెత్తించారు. 65 పరుగులు భాగస్వామ్యం అనంతరం రాజ్‌పుత్ బౌలింగ్‌లో కృనాల్(32: 23 బంతుల్లో,1 ఫోర్,1 సిక్స్) అనవసర షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పోలార్డ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక పొలార్డ్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పోలార్డ్ 50( 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫించ్‌కు చిక్కాడు. ఆ వెంటనే కటింగ్ (4), హార్దిక్ పాండ్యా(9) సైతం పెవిలియన్ చేరారు. చివర్లో మెక్లీగన్ (11 నాటౌట్), మయాంక్ మార్కండే (7 నాటౌట్)లుగా నిలవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆండ్రూ టై మరోసారి (4/16) చెలరేగగా.. అశ్విన్(2/18), రాజ్‌పుత్, స్టోయినిస్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment