అనూహ్యంగా పెరిగిన రాహుల్ ర్యాంక్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో అతడు నంబర్వన్ స్థానం నిలబెట్టుకున్నాడు. అమెరికాలో వెస్టిండీస్ తో జరిగిన టి20లో సెంచరీతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. అనూహ్యంగా 67 స్థానాలు దాటుకుని 31వ ర్యాంకులో నిలిచాడు. ఇదే మ్యాచ్ లో సెంచరీ చేసిన విండీస్ బ్యాట్స్ మన్ ఎవిన్ లూయిస్ 288 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకు దక్కించుకున్నాడు. కోహ్లి తర్వాతి ర్యాంకుల్లో ఆరోన్ ఫించ్, మార్టిన్ గప్టిల్, డూ ప్లెసిస్, జోయ రూట్ ఉన్నారు.
స్పిన్నర్ అశ్విన్ బౌలర్ల విభాగంలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఏడో ర్యాంకు నుంచి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. శామ్యూల్స్ బద్రీ, ఇమ్రాన్ తాహిర్, జస్ప్రీత్ బుమ్రా మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.