
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లి తర్వాత కేఎల్ రాహులే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. రాహుల్ కొత్త బంతితో ఆడటంలో తడబడతాడన్న వ్యాఖ్యలపై లారా విభేదించాడు. అతనికి కొత్త బంతితో ఎటువంటి ఇబ్బంది ఉండదని వెనకేసుకొచ్చాడు. అతనికున్న బ్యాటింగ్ టెక్నిక్‌కు కొత్త బంతి అసలు సమస్య కాదన్నాడు.
‘విరాట్ కోహ్లి తర్వాత రెండో అత్యుత్తమ భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు ఓపెనర్. టీమిండియా ఇప్పటికే అతడిని నాలుగో స్థానంలో ఆడించింది. ఆ స్థానంలో అతడు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తరహాలో అదరగొట్టాడు. రాహుల్ ఓపెనింగ్ అవకాశాన్ని కచ్చితంగా అందిపుచ్చుకుంటాడు. అతడికున్న టెక్నిక్‌కు కొత్త బంతిని ఎదుర్కోవడం అసలు సమస్యే కాదు’ అని లారా అన్నాడు. గాయంతో శిఖర్ ధావన్ జట్టుకు దూరమవ్వడంతో పాక్ మ్యాచ్‌లో రోహిత్‌కు జోడీగా రాహుల్ ఓపెనింగ్ చేశాడు. 78 బంతుల్లో 57 పరుగులు చేసి శుభారంభం అందించడంలో సహకరించాడు.