
లండన్: ఇంగ్లండ్‌లోని భిన్నమైన పరిస్థితులకు తగినట్లుగా ఆటతీరును మార్చుకుంటేనే పరుగులు సాధించగలమని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. బీసీసీఐ కోసం స్పిన్నర్ చహల్ నిర్వహించే స్వల్పకాలిక చర్చా కార్యక్రమం ‘చహల్ టీవీ’లో అతడు మాట్లాడాడు. గత రెండేళ్లలో తాను ఈ విషయాన్ని నేర్చుకున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు. భారత్ ఇటీవల మ్యాచ్‌లాడిన సౌతాంప్టన్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ పిచ్‌లు కొంత నెమ్మదిగా ఉండటంతో ముందుగా కుదురుకుంటే తర్వాత పరుగులు సాధించవచ్చని భావించినట్లు అతడు తెలిపాడు. ‘జట్టులో ధాటిగా ఆడగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దీంతో నేను ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభిస్తున్నా. ఇది నా కర్తవ్యం కూడా. ప్రతి ఇన్నింగ్స్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ మెరుగు పడేందుకు ప్రయత్నిస్తున్నా’ అని అతడు వివరించాడు. ప్రపంచ కప్‌లో నాలుగు శతకాలు చేసిన సహచర ఓపెనర్ రోహిత్‌శర్మపై రాహుల్ ప్రశంసలు కురిపించాడు. పిచ్‌లు స్లోగా ఉన్నా రోహిత్‌లాంటి అత్యుత్తమ ఆటగాళ్లకు అవేమీ ప్రతిబంధకం కాదన్నాడు. బంగ్లాదేశ్‌పై తామిద్దరం నెలకొల్పిన 180 పరుగుల భాగస్వామ్యంపై రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment