'85 ఏళ్ల రికార్డు'పై విరాట్ సేన గురి!
పల్లెకెలె: ఇప్పటికే శ్రీలంకతో టెస్టు సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డుపై దృష్టి సారించింది. మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. చివరిదైన మూడో టెస్టును భారత జట్టు గెలిచిన పక్షంలో.. విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్స్వీప్ చేసిన తొలి భారత క్రికెట్ జట్టుగా విరాట్ సేన నిలుస్తోంది. భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు ప్రయాణంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును విరాట్ సేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ ఘనతను సాధించేందుకు భారత జట్టు కసరత్తులు చేస్తోంది. రేపు(శనివారం) ఉదయం గం.10.00ని.లకు పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ -శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
ఇదిలా ఉంచితే, గత రెండు టెస్టు మ్యాచ్ ల్లో భారత జట్టు ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 304 పరుగుల తేడాతో విజయం సాధించగా, కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-1తో గెలిచింది.
రిజర్వ్ బెంచ్ పరీక్ష!
ఇప్పటికే సిరీస్ ను గెలిచిన పక్షంలో ఫైనల్ మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ ను పరీక్షించాలని భారత జట్టు యోచిస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ కారణంగా రవీంద్ర జడేజా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో స్సిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు జతగా కుల్దీప్ స్పిన్ విభాగాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరొకవైపు భువనేశ్వర్ కుమార్ కూడా ఆడే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో భువనేశ్వర్ ను జట్టులో తీసుకోవచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో కొనసాగిస్తే మాత్రం కుల్దీప్ కు చోటు కష్టం. ఇక్కడ స్పెషలిస్టు సీమర్ ను ఆడించేందుకు కోహ్లి మొగ్గుచూపుతున్నాడు.
జట్లు అంచనా:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
శ్రీలంక: దినేష్ చండీమాల్(కెప్టెన్), దిముత్ కరుణరత్నే,ఉపుల్ తరంగా, కుశాల్ మెండిస్, మాథ్యూస్, నిరోషాన్ డిక్ వెల్లా(వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, దిల్రువాన్ పెరీరా, రంగనా హెరాత్, మలిందా పుష్పకుమార, నువాన్ ప్రదీప్