తమ దేశ ఆటగాళ్లు తప్పా ఇతర ఆటగాళ్లు రికార్డులు సాధిస్తే ఆస్ట్రేలియాకు నచ్చదనే విషయం మరోసారి రుజువైంది. ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఆకాశానికి ఎత్తుతూనే నేలకు దించాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ ఆడటం లేదు కాబట్టి కోహ్లియే ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. బాల్ ట్యాంపరింగ్‌తో అడ్డంగా బుక్కయిన స్మిత్ ఏడాది నిషేధానికి గురైన విషయం తెలిసిందే. నిషేధం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు స్మిత్ దూరమయ్యాడని లేకుంటే అతడే నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ పాంటింగ్ కితాబిచ్చాడు.
గత యాషెస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడని పాంటింగ్ ప్రశంసించాడు. కోహ్లి బ్యాటింగ్ సగటు స్వదేశంలోనే ఎక్కువగా ఉందని, విదేశీ పిచ్‌లపై అతడు రాణించలేడని విమర్శించాడు. స్మిత్ విదేశీ పిచ్‌లపై కూడా ఘనమైన రికార్డులు ఉన్నాయని పేర్కొన్నాడు. వన్డేల్లో స్మిత్ కంటే కోహ్లి అత్యధిక సెంచరీలు సాధించినా.. బ్యాటింగ్ సగటు స్మిత్‌దే ఎక్కువగా ఉందని వివరించాడు. స్మిత్ వచ్చే వరకు కోహ్లియే టెస్టుల్లో నంబర్ వన్ ఆ తర్వాత నంబర్ టూకు పడిపోతాడని జోస్యం చెప్పాడు. 12 నెలల నిషేధం అనంతరం స్మిత్ ఆసీస్ సారథ్య పగ్గాలు చేపట్టి జట్టుకు పూర్వ వైభవం తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టీమిండియాతో సిరీస్‌పై.. ఆసీస్ గడ్డపై టీమిండియా ఎన్నటికీ టెస్టు సిరీస్ గెలవదని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో 1947 నుంచి ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య పదకొండు సిరీస్‌లు జరిగాయని, ఏ ఒక్కటి టీమిండియా గెలవలేదని గుర్తు చేశాడు. ఆసీస్‌లో తమపై భారత్ 44 టెస్టులు ఆడగా కేవలం ఐదు మాత్రమే గెలిచిందని పాంటింగ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment