ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 జాబితాలో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ ఉన్నారు.
దుబాయి: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 జాబితాలో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ చోటు సంపాదించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన తాజా జాబితాలో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మూడో ర్యాంక్ను నిలబెట్టుకోగా, ఓపెనర్ శిఖర్ ధవన్ నాలుగు స్థానాలు సంపాదించి ఐదో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు.
శ్రీలంకతో సిరీస్లో ధవన్ అద్భుతంగా రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్లో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా క్రికెటర్లు డివిలియర్స్,ఆమ్లా వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో భారత్ యువ పేసర్ భువనేశ్వర్ కుమార్.. పాక్ క్రికెటర్ హఫీజ్తో కలసి సంయుక్తంగా ఆరో ర్యాంక్లో నిలిచాడు.