'ప్రతీసారి కోహ్లికి కోపం అవసరం లేదు'
కొలంబో: మైదానంలో తరచు కోపాన్ని ప్రదర్శించడం భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లికి అంత మంచిది కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిగా ఇప్పటికే తానేమిటో కోహ్లి నిరూపించుకున్నప్పటికీ, కెప్టెన్ గా నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని రణతుంగా పేర్కొన్నారు.
ఆటగాడిగా కోహ్లి అత్యుత్తమ స్థాయిని చూశా. అయితే కెప్టెన్ గా అతని ఏ రేటింగ్ ఇవ్వలేను. అతను కెప్టెన్ గా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ప్రతీసారి మైదానంలో కోహ్లి కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పదేపదే కోహ్లి కోపాన్ని తెచ్చుకుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుంది. అవసరమైన సందర్బాల్లో తప్పితే, ప్రతీదానికి కోపంతో కూడిన దూకుడును ప్రదర్శించడం కోహ్లికి మంచిది కాదు. కెప్టెన్ గా ధోని, అజహరుద్దీన్ లతో కోహ్లికి పోలిక వద్దు. కపిల్ దేవ్ పోలిక కోహ్లికి సరిపోతుందేమో. దానికి కూడా కోహ్లి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది' అని రణతుంగ పేర్కొన్నారు.