
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఇటీవలి అద్భుత ప్రదర్శనను ఒకనాటి పాకిస్తాన్ జట్టుతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పోల్చాడు. ముఖ్యంగా కెప్టెన్సీకి సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను విరాట్ కోహ్లి గుర్తుకు తెస్తున్నాడని అతను అన్నాడు. వీరిద్దరిది చివరి వరకు ఓటమి అంగీకరించని తత్వమని మంజ్రేకర్ ప్రశంసించాడు.
‘న్యూజిలాండ్‌లో కోహ్లి నాయకత్వంలోని భారత్ ఆడిన తీరు చూస్తే ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ గుర్తుకొచ్చింది. టీమిండియాకు జట్టుగా తమపై తమకు విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఓడిపోయే దశలో కూడా ఒక మార్గం అన్వేషించి విజయంగా మలచుకోవడం ఇమ్రాన్ కెప్టెన్సీలోని పాక్ జట్టులో కనిపించేది. ఇదంతా ఆత్మవిశ్వాసం బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది’ అని ఈ ముంబైకర్ అభిప్రాయపడ్డాడు.