
రిషబ్ పంత్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం కల్పించకపోవడంపై విరాట్ కోహ్లి స్పందించాడు.
ముంబై: వన్డే ప్రపంచకప్‌కు 15 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు స్థానం కల్పించకపోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. అనుభవం, ఒత్తిడిని తట్టుకుని నిలబడగలడన్న నమ్మకంతో దినేష్ కార్తీక్‌వైపు మొగ్గు చూపినట్టు తెలిపాడు. ‘ఒత్తిడి సమయంలో దినేశ్ కార్తీక్ సంయమనంతో ఆడతాడు. జట్టులోకి అతడిని తీసుకోవాలన్న ప్రతిపాదనకు సెలక్షన్ కమిటీలోని ప్రతి ఒక్కరు ఆమోదం తెలిపారు. కార్తీక్ అనుభవజ్ఞుడు. ఒకవేళ ఎంఎస్ ధోని అందుబాటులో లేకుంటే వికెట్ కీపర్‌గా అతడు కీలకంగా మారతాడు. ఫినిషర్‌గా కూడా బాగానే పనికొస్తాడు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కార్తీక్‌ను ఎంపిక చేశామ’ని కోహ్లి వివరించాడు.
2004లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్ ఇప్పటివరకు భారత్ తరపున 91 మ్యాచ్‌లు ఆడాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. కొన్ని పరిమితుల దృష్ట్యా సమర్థులైన కొంత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయామని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని, వీరిలో 15 మందిని ఎంపిక చేయడం మామూలు విషయం కాదన్నాడు. అయితే యువ ఆటగాళ్లు నిరాశపడొద్దని, ఏ క్షణమైనా అవకాశం రావొచ్చని.. సిద్ధంగా ఉండాలని సూచించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.