వరుసగా ఆరో విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-7లో ప్లేఆప్కు చేరుకుంది.
కోల్ కతా: కీలక మ్యాచ్ లో విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-7లో ప్లేఆప్కు చేరుకుంది. ఊతప్ప బాదుడుకు, సునీల్ నరైన్ స్పిన్ తోడవడంతో నేడిక్కడ జరిగిన మ్యాచ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను గంభీర్ సేన 30 పరుగుల తేడాతో ఓడించింది. కోల్ కతా నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోహ్లి సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
తకావలే 45, కోహ్లి 38, యువరాజ్ 22, రానా 19, డీవిలియర్స్ 13 పరుగులు చేశారు. క్రిస్ గేల్(6) విఫలమయ్యాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 4 వికెట్లు నేలకూల్చాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఊతప్ప, హసన్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. 83 పరుగులు చేసిన ఊతప్పకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.