ILT20 2023: Dubai Capitals Seal 73 Run Win Against Abu Dhabi Knight Riders - Sakshi
Sakshi News home page

ILT20 2023: రాణించిన ఉతప్ప, పావెల్‌.. నైట్‌ రైడర్స్‌కు షాకిచ్చిన క్యాపిటల్స్‌ 

Published Sat, Jan 14 2023 12:10 PM | Last Updated on Sat, Jan 14 2023 1:36 PM

ILT20 2023: Dubai Capitals Seal 73 Run Win Against Abu Dhabi Knight Riders - Sakshi

ఐపీఎల్ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌), బీబీఎల్ (బిగ్‌బాష్‌ లీగ్‌, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌), పీఎస్ఎల్ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్‌) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్‌ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. 

నిన్న (జనవరి 13) జరిగిన లీగ్‌ ఇనాగురల్‌ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌, అబుదాబీ నైట్‌ రైడర్స్‌ జట్లు తలపడగా.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌.. రాబిన్‌ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ రోవమన్‌ పావెల్‌ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

జో రూట్‌ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్‌ రజా (17 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్‌ పఠాన్‌ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) ఆఖర్లో మెరుపులు మెరిపిం‍చారు. నైట్‌ రైడర్స్‌ బౌలర్లలో రవి రాంపాల్‌, అలీ ఖాన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన  నైట్‌ రైడర్స్‌.. రజా అకీఫుల్లా ఖాన్‌ (2/20), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (2/16), రోవమన్‌ పావెల్‌ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్‌ లుక్మా్‌న్‌ (1/27), సికందర్‌ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (12 బంతుల్లో 12; ఫోర్‌) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగా.. కొలిన్‌ ఇంగ్రామ్‌ (1), బ్రాండన్‌ కింగ్‌ (8), జవార్‌ ఫరీద్‌ (9), సునీల్‌ నరైన్‌ (4), కాన్నర్‌ (3), అకీల్‌ హొస్సేన్‌ (3), ఫహాద్‌ నవాజ్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్‌ (6), అలీ ఖాన్‌ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్‌ (ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం), షార్జా వారియర్స్‌ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. 

ఐఎల్‌ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
షెడ్యూల్..
జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్‌ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి.   

ఎలా చూడాలి.. 
ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్‌లలో ఇంగ్లీష్‌, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్‌డీ, హెచ్‌డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్‌డీ, హెచ్‌డీ), పిక్చర్స్‌ హెచ్‌డీ, ఫ్లిక్స్‌ (ఎస్‌డీ, హెచ్‌డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. 

టీమ్స్, ఓనర్స్ ..

  • ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) 
  • అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 
  • డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ)
  • దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) 
  • గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్‌) 
  • షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) 

కెప్టెన్లు..

  • ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్‌ బ్రావో 
  • అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్  
  • డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో 
  • దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్  
  • గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్  
  • షార్జా వారియర్స్ - మొయిన్ అలీ 

లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు..

సునీల్ నరైన్, కీరన్‌ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్‌ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్‌, పాల్‌ స్టిర్లింగ్‌, మొయిన్ అలీ, సికందర్‌ రజా, రాబిన్‌ ఉతప్ప, యూసఫ్‌పఠాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, జో రూట్, క్రిస్ జోర్డాన్,  జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement