రెండో రౌండ్‌కు హంపి, హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో హంపి 2-0తో అయా మొతాజ్ (ఈజిప్టు)పై, హారిక 2-0తో తతేవ్ అబ్రహమియాన్ (అమెరికా)పై విజయం సాధించారు.
బుధవారం జరిగిన తొలి రౌండ్ రెండో గేమ్‌లో హంపి 28 ఎత్తుల్లో అయా మొతాజ్‌ను ఓడించగా... హారిక 51 ఎత్తుల్లో తతేవ్ అబ్రహమియాన్‌పై గెలిచింది. భారత్‌కే చెందిన మేరీ ఆన్ గోమ్స్ తన ప్రత్యర్థి తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌ను 24 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లూ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించడానికి గురువారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి రెండో రౌండ్ పోటీలు జరుగుతాయి.