'అతని బ్యాటింగ్ అద్భుతం'
కొలంబో:భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి లంకేయులు కనీసం రెండొందల పరుగుల మార్కును కూడా చేరకుండానే కుప్పకూలారు. అయితే ఆపై ఫాలో ఆన్ ఆరంభించిన లంకకు కుశాల్ మెండిస్-దిముత్ కరుణరత్నేలు సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడి 191 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే మెండిస్ శతకంతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్ లో మెండిస్ ఆడిన కీలక ఇన్నింగ్స్ పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. 'నిన్నటి ఆటలో మేము రెండోసారి బౌలింగ్ చేసేటప్పుడు బంతులు ఎడ్జ్లు తీసుకునే విధంగా బంతులు సంధించాం. నాతో పాటు జడేజా కూడా అదే తరహాలో బౌలింగ్ లో చేశాడు. కాకపోతే మెండిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చాలా నిలకడగా బ్యాటింగ్ చేసి మాకు పరీక్షగా నిలిచాడు. శ్రీలంక గాడిలో పడటంలో మొత్తం క్రెడిట్ అంతా మెండిస్ దే'అని అశ్విన్ పేర్కొన్నాడు.అయితే ఈ వికెట్ చాలా స్లోగా ఉండటం వల్ల లంక వికెట్లను తీయడానికి ఎక్కువ శ్రమించకతప్పదనే అభిప్రాయాన్ని అశ్విన్ వ్యక్తం చేశాడు.