భారత్‌... జబర్దస్త్‌ | Ravichandran Ashwin spins India to massive win over Sri Lanka in Nagpur Test | Sakshi
Sakshi News home page

భారత్‌... జబర్దస్త్‌

Published Tue, Nov 28 2017 12:33 AM | Last Updated on Fri, Oct 19 2018 7:37 PM

Ravichandran Ashwin spins India to massive win over Sri Lanka in Nagpur Test - Sakshi - Sakshi

ఆశ్చర్యం ఏమీ లేదు. అనూహ్యమేమీ జరగలేదు. శ్రీలంకపై తమ ఆధిపత్యాన్ని బలంగా ప్రదర్శిస్తూ భారత బృందం తమ టెస్టు చరిత్రలో మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో మూడో రోజే గెలుపు దిశగా ప్రయాణం మొదలు పెట్టిన భారత్, సోమవారం ఆ లాంఛనాన్ని పూర్తి చేసింది. పేలవమైన లంక బ్యాటింగ్‌ను కుప్పకూల్చేందుకు టీమిండియా బౌలర్లకు 40.3 ఓవర్లే సరిపోయాయి. కెప్టెన్‌ చండిమాల్‌ కాస్త నిలబడే ప్రయత్నం చేసినా, అది భారత్‌ విజయాన్ని ఆలస్యం మాత్రమే చేయగలిగింది. నలుగురు బౌలర్లు భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించగా... రవిచంద్రన్‌ అశ్విన్‌ 300వ టెస్టు వికెట్‌ సాధించి ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మలచుకున్నాడు.   

నాగ్‌పూర్‌: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేసింది. సోమవారం ఇక్కడి జామ్‌తా మైదానంలో నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2007లో కూడా ఇంతే తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా, తమ టెస్టు చరిత్రలో అతి పెద్ద విజయాన్ని పునరావృతం చేసింది. 21/1 స్కోరుతో ఆట కొనసాగించిన లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 49.3 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ చండిమాల్‌ (82 బంతుల్లో 61; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 4 వికెట్లు పడగొట్టగా... ఉమేశ్, ఇషాంత్, జడేజా తలా 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ టెస్టుల్లో అందరికంటే వేగంగా (54 టెస్టులు) 300 వికెట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్‌ 2 నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది.  

ఏడుగురు పెవిలియన్‌కు... 
నాలుగో రోజు శ్రీలంక జట్టు ఆట చూస్తే ఆటగాళ్లు ముందే ఓటమికి మానసికంగా సిద్ధమై వచ్చినట్లు కనిపించింది.  చండిమాల్‌ మినహా ఏ ఒక్కరూ కనీసం పోరాటపటిమ కనబర్చలేకపోయారు. ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో ఆట కొనసాగించిన లంక కొద్ది సేపటికే కరుణరత్నే (18) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఉమేశ్‌ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి తిరిమన్నె (23) అవుటయ్యాడు. మాజీ కెప్టెన్‌ మాథ్యూస్‌ (10) మరోసారి నిరాశపర్చగా, డిక్‌వెలా (4) కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత అశ్విన్‌ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్‌తో దూకుడు కనబర్చిన షనక (17) అతని తర్వాతి ఓవర్లోనే మరోసారి భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అశ్విన్‌ తన మరుసటి ఓవర్లోనే పెరీరా (0), హెరాత్‌ (0)ల పని పట్టడంతో లంక తొలి సెషన్‌లోనే ఏడు వికెట్లు కోల్పోయింది.  

చండిమాల్‌ పోరాటం... 
సహచరులు వెనుదిరిగినా కెప్టెన్‌ చండిమాల్‌ మాత్రం  పోరాడే ప్రయత్నం చేశాడు. ఉమేశ్, జడేజాల బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత ఇషాంత్‌ ఓవర్లో వరుసగా మరో రెండు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 63 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కెప్టెన్‌కు మరో ఎండ్‌నుంచి లక్మల్‌ (42 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి సహకారం అందించాడు. తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి చండిమాల్‌ అవుటయ్యాడు. కొద్ది సేపటికే అశ్విన్‌ తన క్యారమ్‌ బాల్‌తో గమగే (0)ను బౌల్డ్‌ చేయడంతో భారీ విజయం భారత్‌ ఖాతాలో చేరింది.  

స్కోరు వివరాలు 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 205; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 610/6 డిక్లేర్డ్‌; శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: సమరవిక్రమ (బి) ఇషాంత్‌ 0; కరుణరత్నే (సి) విజయ్‌ (బి) జడేజా 18; తిరిమన్నె (సి) జడేజా (బి) ఉమేశ్‌ 23; మాథ్యూస్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 10; చండిమాల్‌ (సి) అశ్విన్‌ (బి) ఉమేశ్‌ 61; డిక్‌వెలా (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 4; షనక (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 17; పెరీరా (ఎల్బీ) (బి) అశ్విన్‌ 0; హెరాత్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 0; లక్మల్‌ (నాటౌట్‌) 31; గమగే (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 166. 

వికెట్ల పతనం: 1–0; 2–34; 3–48; 4–68; 5–75; 6–102; 7–107; 8–107; 9–165; 10–166. 
బౌలింగ్‌: ఇషాంత్‌ 12–4–43–2; అశ్విన్‌ 17.3–4–63–4; జడేజా 11–5–28–2; ఉమేశ్‌ 9–2–30–2.  

1  భారత టెస్టు చరిత్రలో ఇది అతి పెద్ద విజయం. గతంలోనూ (2007) భారత్, బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్, 239 పరుగులతోనే విజయం సాధించింది.  

32 2017లో భారత్‌ అన్ని ఫార్మాట్‌లలో కలిపి సాధించిన విజయాల సంఖ్య. ఒక ఏడాది టీమిండియా ఇన్ని మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. 2016లో భారత్‌ 31 నెగ్గింది. ఈ ఏడాది భారత్‌ ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.  

100 శ్రీలంకకు టెస్టుల్లో ఇది 100వ పరాజయం కాగా ఆ జట్టు టెస్టు చరిత్రలో ఇదే (ఇన్నింగ్స్, 239 పరుగులు) అతి పెద్ద ఓటమి.  

విదేశాల్లో ఎలా ఆడితే బాగుంటుందో ఇక్కడ కూడా అదే తరహాలో బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించాను. నేను భారీ శతకాలు సాధిస్తే అది జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది కాబట్టి దానిపై దృష్టి పెట్టాను. సెంచరీ కాగానే ఏకాగ్రత కోల్పోయి అవుటైతే వెంటవెంటనే జట్టు వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నిలదొక్కుకున్న బ్యాట్స్‌మన్‌ అయితే బాగా ఆడగలడు. నా ఫిట్‌నెస్‌ కూడా బాగుండటంతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగలుగుతున్నాను. విరామం తర్వాత జట్టులోకి వచ్చిన విజయ్, రోహిత్‌ సెంచరీలు సాధించడం సంతృప్తినిచ్చింది. దేశవాళీలో ఆడుతుండటం వల్ల మా పేసర్లు ఇక్కడా రాణించగలిగారు. ముఖ్యంగా ఇషాంత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు సన్నాహాల కోసమే పేస్‌ పిచ్‌లు కోరుకుంటున్నాం. ఇక్కడి వికెట్‌ గొప్పగా లేకపోయినా కోల్‌కతా మాకు సరిగ్గా సరిపోయింది. 
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement