రెండు క్యాచ్లు నేలపాలు..ఆపై శతకం
హరారే:జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా శతకం నమోదు చేశాడు. తన టెస్టు కెరీర్లో మొదటి శతకం సాధించిన పెరీరాకు జింబాబ్వే ఆటగాళ్లు రెండు లైఫ్లు ఇచ్చారు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో భాగంగా పెరీరా 15, 30 పరుగుల వద్ద రెండు క్యాచ్లు ఇచ్చాడు. అయితే వాటిని అందుకోవడంలో జింబాబ్వే ఫీల్డర్లు విఫలం కావడంతో ఆ తరువాత పెరీరా ఎదురుదాడికి దిగి శతకం బాదేశాడు. 121 బంతులను ఎదుర్కొన్న పెరీరా (110;15 ఫోర్లు, 2 సిక్సర్లు ) సెంచరీ సాధించాడు.
మిగతా శ్రీలంక ఆటగాళ్లలో కౌశల్వ సిల్వా(94), కరుణరత్నే(56)లు రాణించారు. వీరిద్దరి ఇచ్చిన క్యాచ్లను కూడా జింబాబ్వే వదిలేయడంతో శ్రీలంక తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తోంది.