
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. రైల్వేస్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో ఏఏఐ 3–2తో విజయం సాధించింది. జోనల్ స్థాయిలో టోర్నీలు నిర్వహించి విజేత జట్లకు ఈసారి టీమ్ చాంపియన్‌షిప్‌లో అవకాశం కల్పించారు. డిఫెండింగ్ చాంపియన్ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఈసారి టీమ్ విభాగంలో బరిలోకి దిగలేదు.రైల్వేస్‌తో జరిగిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ (ఏఏఐ) 21–17, 21–17తో శుభాంకర్ డే (రైల్వేస్)పై... రెండో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 21–12, 21–14తో అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్)పై నెగ్గడంతో ఏఏఐ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హేమనాగేంద్ర బాబు–కబీర్ కంజార్కర్ (రైల్వేస్) జోడీ 21–18, 17–21, 21–18తో శ్లోక్ రామచంద్రన్–చిరాగ్ సేన్ జంటపై... మహిళల డబుల్స్ మ్యాచ్‌లో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్) ద్వయం 21–8, 21–8తో శ్రేయాన్షి పరదేశి–స్నేహ జంటపై గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రేయాన్షి పరదేశి–శ్లోక్ రామచంద్రన్ జంట 21–9, 17–21, 21–8తో కనిక కన్వల్– అక్షయ్ రౌత్ జోడీపై గెలిచి ఏఏఐ జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment