ఆశలు సజీవం
కీలక మ్యాచ్‌లో నెగ్గిన బెంగళూరు
రాణించిన గేల్, డివిలియర్స్
రైనా శ్రమ వృథా ఐపీఎల్-7
రాంచీ: ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సర్వశక్తులు ఒడ్డింది. పటిష్టమైన చెన్నై సూపర్‌కింగ్స్‌ను మొదట బౌలింగ్‌తో కట్టడి చేసి... ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లి సేన 5 వికెట్ల తేడాతో ధోని బృందంపై విజయం సాధించింది.
జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసింది. సురేశ్ రైనా (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ హస్సీ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్సర్), మెకల్లమ్ (13 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఆరోన్ 2, మురళీధరన్, అబూనెచిమ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. గేల్ (50 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్), డివిలియర్స్ (14 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. అశ్విన్, హస్సీ చెరో రెండు వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రైనా జోరు...
ఓపెనర్లలో స్మిత్ (9) తడబడగా మెకల్లమ్ రెండు సిక్సర్లతో దూకుడును కనబర్చాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో ఆరోన్ ఈ జోడిని విడదీశాడు. దీంతో చెన్నై 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 39/2.
ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్న రైనా, డేవిడ్ హస్సీలు నెమ్మదిగా ఆడారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ జోడి ఆడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేసింది. చాహల్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు చెరో సిక్సర్ కొట్టి ఊపుతెచ్చారు.
నిలకడగా ఆడుతున్న ఈ జంటను చివరకు మురళీధరన్ విడగొట్టాడు. షార్ట్ బంతిని ఫుల్ చేసిన హస్సీ... స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
35 బంతుల్లో రైనా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... అప్పుడే వచ్చిన ధోని (7) వేగంగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివర్లో జడేజా (10 నాటౌట్), రైనా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడంతో చెన్నై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
తడబడి... పుంజుకుని
ఓపెనర్లు బ్యాట్ ఝుళిపించకపోవడంతో బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. విధ్వంసకర హిట్టర్ గేల్‌ను మోహిత్ శర్మ బాగా కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 17 పరుగులు మాత్రమే చేసింది.
అయితే బద్రీ బౌలింగ్‌లో సిక్సర్ సంధించిన గేల్... ఆ తర్వాత కూడా క్రీజ్‌లో చురుకుగా కదల్లేకపోయాడు. ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించిన కోహ్లి అనూహ్యంగా స్టంపౌట్ అయ్యాడు. గేల్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు.
జడేజా బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో గేల్ భారీ షాట్లకు తెరలేపాడు. దాన్ని కొనసాగిస్తూ డివిలియర్స్... హస్సీ, అశ్విన్ ఓవర్లలో మూడు సిక్సర్లు సంధించాడు. అయితే వీరిద్దరు 17 బంతుల్లో 35 పరుగులు జోడించి స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు.
చివరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సిన దశలో యువరాజ్ (13 నాటౌట్) సిక్సర్ కొట్టి గెలిపించాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 9; బ్రెండన్ మెకల్లమ్ (సి) స్టార్క్ (బి) ఆరోన్ 19; రైనా నాటౌట్ 62; డేవిడ్ హస్సీ (సి) స్టార్క్ (బి) మురళీధరన్ 25; ధోని (సి) గేల్ (బి) అహ్మద్ 7; జడేజా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 138
వికెట్ల పతనం: 1-29; 2-29; 3-104; 4-115.
బౌలింగ్: మురళీధరన్ 4-0-29-1; స్టార్క్ 4-0-23-0; ఆరోన్ 3-0-29-2; అహ్మద్ 4-0-18-1; చాహల్ 4-0-27-0; రైనా 1-0-9-0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) అశ్విన్ 46; పార్థివ్ (సి) రైనా (బి) అశ్విన్ 10; కోహ్లి (స్టంప్డ్) ధోని (బి) జడేజా 27; డివిలియర్స్ (సి) జడేజా (బి) హస్సీ 28; యువరాజ్ నాటౌట్ 13; సచిన్ రాణా (బి) మెకల్లమ్ (బి) హస్సీ 1; అబూనెచిమ్ అహ్మద్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-14; 2-75; 3-110; 4-125; 5-138
బౌలింగ్: మోహిత్ శర్మ 2-0-13-0; అశ్విన్ 4-1-16-2; బద్రీ 3-0-15-0; రైనా 4-0-20-0; జడేజా 4-0-31-1; హస్సీ 2.5-0-38-2.