
బౌలర్లే లీడర్లు!
కోచ్ ఎవరైనా ఆటగాళ్లే ముఖ్యం
నా పరిమితులు నాకు తెలుసు
భారత కోచ్ అనిల్ కుంబ్లే
బెంగళూరు: ఆటగాడిగా సుదీర్ఘ కెరీర్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్ బృందం మొత్తాన్ని ముందుండి నడిపించిన రోజులు ఉన్నాయి. తన బౌలింగ్ ముగించి మైదానంలో ఎక్కడో నిలబడిపోకుండా ఇతర బౌలర్లకు తగు సూచనలివ్వడంలో, వ్యూహాలు రూపొందించడంలో కూడా కుంబ్లే కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కోచ్‌గా కూడా అదే వాతావరణం కల్పించాలని ఆయన భావిస్తున్నారు. జట్టు బౌలర్లలో స్ఫూర్తి నింపి, మరింత బాధ్యతగా వ్యవహరించే విధంగా ప్రోత్సహిస్తానని కుంబ్లే చెప్పారు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం తొలిసారి అనిల్ కుంబ్లే మీడియాతో మాట్లాడారు. రాబోయే ఏడాది కాలం పాటు కోచ్‌గా తన ఆలోచనలు, జట్టు సభ్యులు, సన్నాహాలకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. విశేషాలు కుంబ్లే మాటల్లోనే...
కోచ్‌గా ప్రాధాన్యతలు...
ముందుగా నేను మా బౌలింగ్ విభాగంపై దృష్టి పెట్టదలిచాను. నా దృష్టిలో ప్రస్తుతం చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పను. అయితే ప్రాథమికంగా బౌలర్లతో అన్ని విషయాలు చర్చించి వారి ఆలోచనలు తెలుసుకుంటాను. ఆ తర్వాతే జట్టు వ్యూహాలకు అవకాశం ఉంటుంది. అవసరమైతే పేస్ బౌలింగ్ కోచ్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. నేను బౌలింగ్ వేసే సమయంలో నన్ను నేను కెప్టెన్‌గా భావించుకునేవాడిని. అప్పుడే మరింత సమర్థంగా బౌలింగ్ చేయగలం. మా బౌల ర్లు కూడా నాయకులుగా ఎదగాలనేది నా ప్రయత్నం.
కోచ్ పని మైదానం బయటే...
మైదానంలో అన్ని నిర్ణయాలు కెప్టెన్‌వే ఉంటాయి. ఆటకు ముందు అవసరమైన వ్యూహరచన, సన్నాహాల్లో సహకరించడంలాంటివే కోచ్ చేయగలడు. మైదానంలో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఆటగాళ్లను సిద్ధం చేయడమే నా పని. వీటితో పాటు నా అనుభవం జట్టుకు ఉపయోగపడేలా చేస్తా. కోచ్, ఇతర సిబ్బంది ముందుకు రాకూడదు. ఆటగాళ్లే అందరికంటే ముఖ్యం. నేను ఆటగాడిగా కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కోచ్‌గా నా పరిమితులేమిటో బాగా తెలుసు.
యువ ఆటగాళ్లలో స్ఫూర్తి...
నన్ను కూడా కొన్నిసార్లు జట్టులోంచి తొలగించారు. కొన్ని పర్యటనలకు ఎంపిక చేయలేదు. కీలక ఆటగాడైన నన్నూ మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు. ఇలాంటి సమయంలోనే ఆయా ఆటగాళ్లు స్థైర్యం కోల్పోకుండా చూడాలి. ఏం ఫరవాలేదని కోచ్ ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. జట్టు వ్యూహాలు 11 మంది కోసమే కాదు మిగతావారినీ భాగం చేయాలి. ఈ ప్రయత్నంలో ఇబ్బంది లేకుండా వ్యవహరించగలనని నమ్ముతున్నా. ప్రస్తుత జట్టులో 25-26 ఏళ్ల వయసు గల ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో టెస్టులు ఆడారు. కాబట్టి ఇబ్బంది రాదు.
ఆధునిక క్రికెట్ గురించీ తెలుసు...
2008లో నేను రిటైర్ అయిన తర్వాత భారత జట్టులో వచ్చిన ప్రధాన మార్పు ఏదైనా ఉందీ అంటే ఫీల్డింగే. ఇప్పుడు చాలా మెరుగైంది. ఫిట్‌నెస్ కూడా అద్భుతంగా ఉంది. ఇది మినహా నేనూ ఆటతో పాటు అప్‌డేట్ అవుతూ వచ్చాను. వివిధ అధికారిక హోదాలతో పాటు కొంత మందితో ఐపీఎల్‌లో కలిసి పని చేశాను. వారికి ఏం కావాలో, భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. వారిని నేను బాగా అర్థం చేసుకోగలను.
రాబోయే విండీస్ సిరీస్‌పై...
గత వెస్టిండీస్ పర్యటనలో మనం గెలిచాం. కాబట్టి మనవాళ్లకు అక్కడ కొంత అనుభవం ఉందని చెప్పవచ్చు. అప్పుడు బాగా ఆడినవారిలో కొంత మంది ఈ జట్టులోనూ ఉన్నారు. నాకూ విండీస్ పిచ్‌లపై అవగాహన ఉంది. టెస్టుల్లో ఆ జట్టు గొప్పగా ఆడకపోయినా సొంతగడ్డపై బలమైనదే. అయితే సిరీస్ గెలుస్తామని నమ్మకముంది. కోహ్లి, ధోనిలు ఇద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. జింబాబ్వే సిరీస్ తర్వాత ధోనితో కూడా మాట్లాడాను.
పదవి శాశ్వతం కాదు...
కోచ్ ఎంపిక వివాదం కావడం నాకిష్టం లేదు. నేను ఎంపిక కాగానే ముందుగా రవిశాస్త్రికే ఫోన్ చేశాను. ఆయనా నన్ను అభినందించారు. ఇన్నాళ్లూ శాస్త్రి చాలా బాగా పని చేశారు. కోచ్‌గా నేనేమీ శాశ్వతం కాదు. రేపు నా స్థానంలో మరొకరు రావచ్చు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదైనా చేసి చూపించేందుకు ప్రయత్నిస్తా. భారత జట్టు బాగా ఆడాలని, గెలవాలనేదే అందరి లక్ష్యం.
శిబిరం మొదలు...
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు బుధవారం బెంగళూరులో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. తొలి రోజు వర్షం కారణంగా శిబిరం ఇండోర్ గ్రౌండ్‌కే పరిమితమైంది. టెస్టు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ దీనికి హాజరయ్యారు. విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.