క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ దేశవాళీ టి20 టోర్నీ ‘సూపర్ స్మాష్’లో భాగంగా ఆదివారం క్యాంటర్‌బరీ కింగ్స్, నార్తర్న్ నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. క్యాంటర్‌బరీ కింగ్స్ బ్యాట్స్‌మన్ లియో కార్టర్ ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడు. క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. నార్తర్న్ నైట్స్ జట్టు స్పిన్నర్ ఆంటోన్ డెవ్‌రిచ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కార్టర్ ‘ఆరే’శాడు. కార్టర్ విధ్వంసంతో (29 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో క్యాంటర్‌బరీ కింగ్స్ జట్టు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది.
అన్ని ఫార్మాట్లలో ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కార్టర్ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ (భారత్), వైట్‌లీ (ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఈ ఘనత సాధించారు. –సోబర్స్ (కౌంటీ క్రికెట్‌లో), రవిశాస్త్రి (రంజీ ట్రోఫీ) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో... గిబ్స్ అంతర్జాతీయ వన్డే (2007 వరల్డ్ కప్) మ్యాచ్‌లో, యువరాజ్ (2007 వరల్డ్ కప్) అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో... వైట్‌లీ (నాట్‌వెస్ట్ ట్రోఫీ), హజ్రతుల్లా (అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్), కార్టర్ (సూపర్ స్మాష్ టోర్నీ) దేశవాళీ టి20 క్రికెట్‌లో ఈ ఘనత నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment