అనంతపురం కోర్టులో ధోనీకి ఊరట!
అనంతపురం: అనంతపురం కోర్టులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఊరట లభించింది. ఓ కేసులో ఆయనకు వ్యతిరేకంగా తాను ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉత్తర్వులను కోర్టు వెనుకకు తీసుకుంది. బిజినెస్ మ్యాగజీన్ కవర్ పేజీపై ధోనీ విష్ణుమూర్తి అవతారంలో కనిపించి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ స్థానిక వీహెచ్‌పీ కార్యకర్త వై శ్యాంసుందర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత ఏడాది జనవరి 7న ధోనీకి వ్యతిరేకంగా అనంతపురం కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.
ధోనీ తరఫున ఢిల్లీకి చెందిన న్యాయవాదులు రాజనిష్ చోప్రా, పంకజ్ భగ్లా మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. గతంలో కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌కు ధోనీకి అందలేదని వారు మేజిస్ట్రేట్ గీతావాణికి తెలిపారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు తన ఉత్తర్వులను వెనుకకు తీసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధోనీ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ తరఫున ఆయన కేసును ఇకముందు తాను వాదించేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి 'వకాలత్‌నామా'ను దాఖలుచేశారు.