మా ఓపెనింగ్ కు జడుసుకుంటున్నారు: లిన్
మొహాలీ: కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనింగ్ జంటను చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్ గా సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడని లిన్ పేర్కొన్నాడు. మంగళవారం కింగ్స్ పంజాబ్ తో కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో క్రిస్ లిన్ 52 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో లిన్-నరైన్ లు పరుగుల సునామిని సృష్టించారు. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ కేవలం 15 బంతుల్లో వేగవంతమైన రికార్డు అర్ధసెంచరీ నమోదు చేశాడు.
సునీల్ నరైన్ ఓపెనర్ గా రాణించడం, రాబిన్ ఊతప్ప తిరిగి జట్టులో చేరడంతో మా బ్యాటింగ్ లైనప్ బలపడిందని లిన్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్ధులు మా బ్యాటింగ్ బలాన్ని చూసి భయపడుతున్నారని, మేము మా ఆట పట్ల పాజిటివ్ గా ఉన్నామని తెలిపాడు. కేకేఆర్ 13 మ్యాచ్ లు ఆడి 8 గెలిచిందని, ఇంకో మ్యాచ్ మిగిలి ఉందని ఇది గెలిచి రెండో స్థానం కైవసం చేసుకుంటామని లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండు సార్లు చాంపియన్ అయిన కోల్ కతా కు ఇది కష్టమేమి కాదని లిన్ పేర్కొన్నాడు. పంజాబ్ తో ఓడడం నిరాశపరిచిందని, ఓటమికి 6,11 ఓవర్లో బంతులు డాట్ అవ్వడమే కారణమన్నాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బాల్స్ వేసారని రెండు వికెట్లు త్వరగా కోల్పోవడం కూడా ఓటమికి కారణమైందని లిన్ వ్యాఖ్యానించాడు. ఒక వేళ ముంబైతో జరిగే మ్యాచ్ లో ఓడితే మేము కాంపిటేషన్ నుంచి తప్పుకున్నట్లేనని, ముంబై పై గొప్ప ప్రదర్శన మా జట్టుకు అవసరమని లిన్ అభిప్రాయపడ్డాడు.