
మాధవన్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్‌లో రాష్ట్రానికి చెందిన మాధవన్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మాధవన్ స్వర్ణ పతకంతో మెరిశాడు. జిమ్నాస్టిక్స్ అండర్–14 టేబుల్‌వాల్ట్ ఈవెంట్‌లో మాధవన్ 13.34 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన వీర్ 13.20 పాయింట్లతో రెండోస్థానం దక్కించుకోగా... పంజాబ్‌కు చెందిన కృష్ణ (12.57 పాయింట్లు) మూడో స్థానాన్ని సాధించాడు.
బాస్కెట్‌బాల్‌లో నిరాశ
ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జరుగుతోన్న బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో రాష్ట్ర జట్లకు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాష్ట్ర జట్లు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అండర్–14 బాలికల మ్యాచ్‌లో కర్ణాటక 47–38తో తెలంగాణను ఓడించగా... బాలుర విభాగంలో మధ్య ప్రదేశ్ 52– 38తో తెలంగాణపై గెలిచి కాంస్య పతకాలు సాధించాయి.
టెన్నిస్‌లో 7 పతకాలు
జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్‌లో రాష్ట్ర క్రీడాకారులు ఆకట్టుకున్నారు. వ్యక్తిగత, డబుల్స్, టీమ్ విభాగాల్లో కలిసి మొత్తం 7 పతకాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో బాలికల సింగిల్స్‌లో సాయిధన్వి రజతాన్ని, జనని కాంస్య పతకాన్ని సాధించగా... డబుల్స్ విభాగంలో ఎస్. సంజన– ఆశ్రిత జోడి స్వర్ణంతో మెరిసింది. టీమ్ విభాగంలో తెలంగాణ బాలికల జట్టు రజతాన్ని, బాలుర జట్టు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. అండర్–17 విభాగంలో బాలికల డబుల్స్ కేటగిరీలో ఎ. సంజన– ఆర్. సంజన ద్వయం కాంస్యాన్ని సాధించింది. బాలుర టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది.