‘టెస్టు’ ముగించాడు | Mahendra Singh Dhoni retires from Test cricket | Sakshi
Sakshi News home page

‘టెస్టు’ ముగించాడు

Published Wed, Dec 31 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

‘టెస్టు’ ముగించాడు

‘టెస్టు’ ముగించాడు

భారత క్రికెట్‌ను శిఖరానికి తీసుకెళ్లిన నాయకుడు తన బాధ్యతలను ‘పరిమితం’ చేసుకున్నాడు. ఐదు రోజుల ఆటలో అతని బ్యాటింగ్‌ను, కీపింగ్‌ను చూసేందుకు... వ్యూహ ప్రతివ్యూహాలను పరిశీలించేందుకు ఇకపై అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని కొన్నాళ్ల క్రితం చెప్పిన మహేంద్ర సింగ్ ధోని ఊహించినట్లుగానే అందుకోసం టెస్టులను ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు అందని అనూహ్యమైన వ్యూహాలు, నిర్ణయాలు తీసుకునే ధోని శైలిలోనే అతని రిటైర్మెంట్ ప్రకటన కూడా వెలువడింది.
 
ఐదు రోజుల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ధోని

అనూహ్య ప్రకటనతో ఆశ్చర్యపరిచిన కెప్టెన్
నిర్ణయం తక్షణం అమల్లోకి   మెల్‌బోర్న్ టెస్టే ఆఖరిది
వన్డేలు, టి20ల్లో కొనసాగింపు

మెల్‌బోర్న్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ చెబుతున్నట్లు భారత కెప్టెన్ ధోని మంగళవారం ప్రకటించాడు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుం దని మెల్‌బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత వెల్లడించాడు. దాంతో భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో భాగంగా జనవరి 6 నుంచి 10 వరకు సిడ్నీ లో జరిగే చివరిదైన నాలుగో టెస్టులో అతను ఆడే అవకాశం లేదు. ఈ టెస్టులో విరాట్ కోహ్లి భారత జట్టుకు సారథ్యం వహిస్తాడు.

ఊహించని విధంగా...
మెల్‌బోర్న్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన అనంతరం మైదానంలో ముగింపు కార్యక్రమం వద్ద గానీ... ఆ తర్వాత మీడియా సమావేశంలో గానీ ధోని తన రిటైర్మెంట్ గురించి చెప్పలేదు. అసలు అలాంటి ఉద్దేశ్యం ఉన్నట్లుగా కూడా అతను ఎక్కడా మాట్లాడలేదు. ఆ తర్వాతే బీసీసీఐ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రకటన వెలువడింది. ఏకకాలంలో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లతో ఒత్తిడి, శ్రమకు గురవుతున్న కారణంగా టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ప్రకటనలో కారణంగా చూపారు. ‘వన్డేలు, టి20లపై దృష్టి పెట్టేందుకు ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. అతని నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తోంది. భారత జట్టుకు అతను అందించిన సేవలకు కృతజ్ఞతలు’ అని బీసీసీఐ పేర్కొంది.
 
కారణమేంటి...
వన్డేలు, టి20ల్లోనే కాక టెస్టుల్లో కూడా భారత అత్యుత్తమ కెప్టెన్‌గా రికార్డు ధోనికే సొంతం. అయితే ఇతర రెండు ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో ధోని బ్యాట్స్‌మన్‌గా అంత సమర్థుడు కాదని అందరూ అంగీకరించే విషయం. కెప్టెన్‌గా కూడా ఇటీవల అతని వ్యూహాలపై ఎక్కువ సార్లు విమర్శలే వచ్చాయి. గత కొన్నాళ్లుగా విదేశాల్లో వరుస పరాజయాలు ధోనిని వెంటాడుతున్నాయి.

30 విదేశీ టెస్టుల్లో అతను 6 టెస్టులు మాత్రమే గెలిపించగలిగాడు. పైగా ఈ సిరీస్‌లో అడిలైడ్ టెస్టు తర్వాత కోహ్లి కెప్టెన్సీపై ప్రశంసలతో పాటు... ధోని తప్పుకుంటే మేలు అనే అభిప్రాయాలు రావడం కూడా అతనిపై ఒత్తిడి పెంచినట్లుంది. ఇకపై టెస్టుల్లో నాయకుడిగా కొనసాగినా ధోని సాధించేందుకు మిగిలింది ఏమీ లేదు. కెప్టెన్‌గా లేడంటే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అతనికి ఖచ్చితంగా టెస్టు జట్టులో స్థానం ఉండదు. కాబట్టి ఫార్మాట్‌కే పూర్తిగా అతను గుడ్‌బై చెప్పేశాడు.
 
మహేంద్రజాలం...

సాక్షి క్రీడావిభాగం: 90 టెస్టులు పూర్తయ్యాయి. మరో 10 ఆడితే సెంచరీ పూర్తయ్యేది. ఆడలేకపోయేవాడా? ఖచ్చితంగా ఆడగలిగేవాడు. కానీ ఆ అవసరం అతనికి కనిపించలేదు. అద్భుతమైన ముగింపు కావాలి అని కోరుకుంటే బీసీసీఐ సొంతగడ్డపైనే ఒక సిరీస్ పెట్టేసి భారీగా వీడ్కోలు పలికేది. కానీ అతను పట్టించుకోలేదు. రిటైర్మెంట్ గురించి ముందే చెప్పి సహచరుల భుజాలపై ఊరేగుతూ ఆఖరి టెస్టును చిరస్మరణీయం చేసుకోలేకపోయేవాడా..! అదేమీ పెద్ద విషయం కాదు... కానీ అతను కోరుకోలేదు. తను ఆడే షాట్ల తరహాలోనే బుల్లెట్ వేగంతో మనసులో ఉన్నది చెప్పేశాడు.

‘ఆఖరి సందేశం’ తరహాలో మీడియా ముందు హడావిడి చేయకుండా నిష్ర్కమించేశాడు. తన ఆటైనా, ఆలోచనలైనా, వ్యూహాలైనా ధోని ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తే. ఇప్పుడు టెస్టుల నుంచి తప్పుకున్న క్షణాన కూడా ఈ ‘మిస్టర్ కూల్’ తన శైలిని వీడలేదు.
 
విజయ శిఖరం...
ధోని టెస్టు కెరీర్ గురించి చెప్పగానే బ్యాట్స్‌మన్‌గాకంటే ఒక కెప్టెన్‌గానే అతను ఎక్కువ మందికి గుర్తుండిపోతాడు. ఒకరా, ఇద్దరా...జట్టులో ఎంత మంది సీనియర్లు, ఎంత మంది దిగ్గజాలు. అలాంటి జట్టుకు నాయకత్వం వహించడమంటే మాటలు కాదు. కానీ ధోని దానిని చేసి చూపించాడు. టి20లకే పనికొస్తాడు అన్నవారే వన్డేల్లో బెస్ట్ కెప్టెన్ అన్నారు. టెస్టుల్లో నాయకత్వం వహించడమంటే మాటలు కాదు అన్నవారే జట్టుకు వరుస విజయాలు అందించిన నాడు ఇది ధోనికే సాధ్యం అని ప్రశంసించారు.

60 టెస్టుల నాయకత్వ ప్రస్థానంలో అతను ఎన్నో ‘తొలి’ రికార్డులు తన పేరుకు ముందు చేర్చాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికాను ఓడించడంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకలపై వరుస సిరీస్ విజయాలు భారత్‌ను 2009లో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ జట్టును చేశాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో కూడా భారత్ సిరీస్ సమం చేయగలిగింది.
 
తిరోగమనం...
దాదాపు రెండేళ్లు నంబర్‌వన్ హోదా అనుభవించిన తర్వాత 2011 ఇంగ్లండ్ సిరీస్ నుంచి ధోని కెప్టెన్‌గా వైఫల్యాల బాటలో నడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో వరుసగా 0-4 తేడాతో సిరీస్‌లు కోల్పోవడం అతని నాయకత్వంపై ప్రశ్నలు రేపింది. 2011 నుంచి ధోని కెప్టెన్సీలో విదేశాల్లో భారత్ 22 టెస్టుల్లో 13 ఓడింది.

సొంతగడ్డపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను చిత్తు చేసినా... ఇంగ్లండ్ చేతిలో భారత్‌లోనే ఓడిపోవడం అతడిని ఇబ్బంది పెట్టింది. చరిత్ర పునరావృతం అయినట్లు ఈ ఏడాది మళ్లీ ఇంగ్లండ్, ఆసీస్‌ల చేతిలో పరాజయాలు ఎంఎస్ కెప్టెన్సీ గురించి ఆలోచించేలా చేశాయి. తనకంటే ఎంతో సీనియర్లు ఉన్న జట్టును, పూర్తిగా యువ ఆటగాళ్లతో ఉన్న జట్టును కూడా కెప్టెన్‌గా అతను సమర్థంగా నడిపించాల్సి వచ్చింది.
 
బ్యాటింగ్ చమక్కులు...
టెస్టు బ్యాట్స్‌మన్‌గా ధోనికి పెద్ద గుర్తింపు లేకపోయినా  కెరీర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అతని ఆరు సెంచరీల్లో ఐదు సొంతగడ్డపైనే వచ్చాయి. ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌తో ఒక దశలో భారత్ 45 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు 153 బంతుల్లో 148 పరుగులు చేసిన తొలి సెంచరీ చిరస్మరణీయం.

మొహాలీలో ఆస్ట్రేలియాపై 92, 68 నాటౌట్... ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పుడు చేసిన 71 పరుగులు... శ్రీలంకపై అహ్మదాబాద్‌లో చేసిన సెంచరీతో మ్యాచ్ ‘డ్రా’ కావడం చెప్పుకోదగ్గ క్షణాలు. అయితే వీటన్నంటికి మించి రెండేళ్ల క్రితం చెన్నైలో ఆసీస్‌పై చేసిన అద్భుతమైన డబుల్ సెంచరీ ధోని కెరీర్‌లో ‘ది బెస్ట్’గా చెప్పవచ్చు.
 
అతనంతే...
‘అతను పేరుప్రఖ్యాతులను పట్టించుకోడు... అలాగే అతని వ్యక్తిత్వాన్ని గౌరవించకుండా ఎవరూ ఉండలేరు. అతను సాధన చేశాడు... మెరుగు పర్చుకున్నాడు. కానీ తన బ్యాటింగ్ శైలి గురించి ఏనాడూ అసంతృప్తి ప్రకటించలేదు. తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నాడు. అది అతని జార్ఖండ్‌లాగే అందంగా లేకపోవచ్చు, కానీ సొంతంగా నేర్చుకున్న  బ్యాటింగ్, కీపింగ్ టెక్నిక్‌కే అతను తన పట్టుదలను జోడించి మరింతగా రాటుదేలాడు.

కఠిన పరిస్థితుల్లో ఆడటంలో ఆరితేరాడు’ ఇదీ ధోని గురించి అతని సన్నిహితులు తరచుగా చెప్పే మాట. దీని ప్రకారం అతని ప్రయాణాన్ని ఆసాంతం గమనిస్తే ధోని రిటైర్మెంట్ ప్రకటన ఆశ్చర్యం కలిగించదు. బహుశా అతని వన్డే రిటైర్మెంట్ కూడా ఇంతకంటే భిన్నంగా ఉండకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement