మెంటర్ గా ధోనీ!
టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తులో కోచ్ కావాలనుకుంటాన్నాడా.. అంటే క్రికెట్ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ క్రెయిగ్ మెక్ డెర్మాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేస్తున్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ను ఎంచుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే ఎంఎస్ ధోనీకి మెంటర్ గా బాధ్యతలు అప్పగించాడు.
న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఆ అకాడమీ ప్రమోషన్ ఈవెంట్లో ధోనీ, క్రెయిగ్ డార్మెట్ పాల్గొన్నారు. ఈ అకాడమీలో క్రికెట్కు సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ ఇన్ స్పోర్ట్స్ లాంటి ప్రత్యేకమైన కోర్సులను ఆఫర్ చేస్తున్నట్టు ధోనీ తెలిపాడు. చాలామంది తెలివైనవాళ్లు ఆటల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. వీరు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, కానీ ఒకే రంగంపై పూర్తిగా దృష్టిసారించాలని ధోనీ పిలుపునిచ్చాడు.
క్రెయిగ్ అకాడమీలో అప్పుడప్పుడు శిక్షణలో ధోనీ తన సేవలను అందించనున్నాడు. కొంతకాలం తర్వాత ధోనీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ను కూడా స్టార్ట్ చేస్తాడని క్రెయిగ్ పేర్కొన్నాడు. అకాడమీ లాంటి వాటిపై సాధారణంగా కోచ్ తరహా ఆలోచనలున్నవాళ్లు మాత్రమే దృష్టిసారిస్తారు. కొన్నేళ్ల తర్వాత కోచ్ పదవికి ధోనీ కచ్చితంగా రేసులో నిలుస్తారని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.