అది లేకపోతే మంచి కోచ్ కాలేడు: గంగూలీ
కోల్కతా:టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే నిష్క్రమణ తర్వాత బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరోసారి పెదవి విప్పాడు. విరాట్ కోహ్లి-కుంబ్లేల వివాదాన్ని బీసీసీఐ పరిష్కరించడంలో విఫలమైందని కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించిన గంగూలీ.. అసలు క్రికెట్ అనేది కెప్టెన్ గేమ్ అని తాజాగా అభిప్రాయపడ్డాడు. పనిలో పనిగా కోచ్లకు నైపుణ్యం ఉంటే సరిపోదని, వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుసుండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'క్రికెట్ అనేది కెప్టెన్ గేమ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కోచ్ అనే వాడి బాధ్యత కేవలం జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడటం మాత్రమే. చక్కటి ప్రజంటేషన్ ఇచ్చినంత మాత్రాన మెరుగైన కోచ్లు కాలేరు. ముందు వ్యక్తులతో ఎలా మెలగాలో(మ్యాన్ మేనేజ్మెంట్ )తెలుసుండాలి' అని దాదా తెలిపాడు. కాగా, భారత జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు తమవంతు కృషిచేస్తామన్నాడు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్న తర్వాత గంగూలీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అసలు గంగూలీ వ్యాఖ్యాల వెనుక ఉద్దేశం ఏమిటో అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. ఇది కచ్చితంగా కుంబ్లేను మరింత అవమానపరచడంగా భావిస్తున్నారు.