'కుంబ్లే లేకుండా వెళ్లే ప్రసక్తే లేదని చెప్పాం'
కోల్ కతా:'అనిల్ కుంబ్లే వద్దంటే వద్దు. విదేశాల్లో కుంబ్లే వికెట్లు తీయలేడు. అక్కడ పరిస్థితులు కుంబ్లే బౌలింగ్ కు అనుకూలించవు. భారత్ బయట కుంబ్లే బంతిని టర్న్ చేయలేడు' అని 2003-04 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో సెలెక్టర్లు అన్న మాటలు. ఈ విషయాన్ని శుక్రవారం బయటపెట్టిన గంగూలీ ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ఆ టూర్ కు కుంబ్లేను పక్కకు పెట్టడానికి దాదాపు రంగం సిద్ధమైన తరుణంలో.. తాను పట్టుబట్టడంతో తిరిగి అతన్ని జట్టులో వేసుకోవాల్సి వచ్చిందని గంగూలీ తెలిపాడు.
గవాస్కర్- బోర్డర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియాకు టూర్ కు పయనం అయ్యే సమయంలో కుంబ్లే స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మురళీ కార్తీక్ ను తీసుకోదలచారు. విదేశీ పిచ్ లపై కుంబ్లే రాణించలేడని పక్కకు పెట్టాలని సెలెక్టర్లు భావించారు. అయితే కుంబ్లే లేకుండా ఆసీస్ టూర్ కు వెళ్లే ప్రసక్తే లేదని సెలెక్టర్లకు తెగేసి చెప్పినట్లు గంగూలీ పేర్కొన్నాడు.దాంతో సెలెక్టర్లు అర్థరాత్రి గం.2.00ల వరకూ అనేక తర్జనభర్జనలు పడి ఎట్టకేలకు కుంబ్లేను ఎంపిక చేశారన్నాడు. అలా ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన తాము కుంబ్లే చలవతో ఆ సిరీస్ ను డ్రా చేసుకున్నామన్నాడు. ఆ సిరీస్ లో కుంబ్లే 24 వికెట్లు తీసి తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని గంగూలీ తెలిపాడు. దాంతో పాటు ఆ సీజన్ లో ఐసీసీ క్యాలెండర్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా కుంబ్లే గుర్తింపు పొందినట్లు బెంగాల్ దాదా పేర్కొన్నాడు.