ముంబై:గతంలో తాను భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన‍్న సమయంలో ఒకానొక సందర్బంలో అనిల్ కుంబ్లే ఎంపిక కోసం సెలక్టర్లతో యుద్దమే చేశానని సౌరవ్ గంగూలీ తాజాగా స్పష్టం చేశాడు. 2003-04 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో కుంబ్లే తప్పకుండా జట్టులో ఉండాలని కోరుతూ సెలక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చానని గంగూలీ తెలిపాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లకు తనకు ఒక చిన్నపాటి యుద్దమే జరిగిందన్నాడు. ఒకవేళ కుంబ్లేను జట్టులోకి తీసుకోలేకపోతే తాను క్రికెట్ నుంచి వైదొలుగుతానని సెలక్టర్లను హెచ్చరించిన విషయాన్ని గంగూలీ మరొకసారి గుర్తుచేసుకున్నాడు.
'గత పాతికేళ్లలో భారత్ నుంచి వచ్చిన గొప్ప మ్యాచ్ విన్నర్లలో కుంబ్లే ఒకడు. కాస్త ఫామ్ కోల్పోయిన కారణంగా 2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు అనిల్‌ను పక్కన పెడదామని చూశారు. ఆ విషయం నేను సెలక్టర్ల సమావేశానికి వెళ్లిన తరువాత కానీ అర్థం కాలేదు. కుంబ్లే మ్యాచ్ విన్నర్ అని.. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమేనని చాలాసేపు సెలక్టర్లను అభ్యర్థించాను. వాళ్లు నా మాట వినలేదు. చివరికి కోచ్ జాన్ రైట్ కూడా నువ్వు ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయి వెళిపోదాం అన్నాడు. నేను వదల్లేదు. కుంబ్లేనే తీసుకోకపోతే నేనూ ఆ జట్టులో ఉండను అని చెప్పేశాను. ఎట్టకేలకు నా ప్రయత్నం ఫలించింది' అని గంగూలీ తెలిపాడు. తన కెప్టెన్సీ సమయంలో పలువురి ఆటగాళ్లకు గంగూలీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్‌లు పేర్లను ప్రధానంగా చెప్పుకొవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment