మట్టి కోర్టులో మహరాణి
ఫ్రెంచ్ ఓపెన్ విజేత షరపోవా
కెరీర్‌లో రెండోసారి ఈ ఘనత
ఫైనల్లో సిమోనా హలెప్‌పై గెలుపు
‘‘నా కెరీర్‌లో ఆడిన అత్యంత కఠినమైన గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఇదే. నాకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండోసారి గెలవడమంటే కల నిజమైనట్టే. భావోద్వేగంలో మాటలు కూడా రావడంలేదు’’
- షరపోవా
షరపోవా ప్రైజ్ మనీ
రూ. 13.29 కోట్లు
హలెప్ ప్రైజ్‌మనీ
రూ. 6.64 కోట్లు
ఏడేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ మారింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ పాత చాంపియన్‌కు కిరీటం దక్కింది. మట్టి కోర్టుపై మెరుపు ఆటతీరుతో అలరించిన రష్యా సుందరి మరియా షరపోవా మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ క్వీన్‌గా నిలిచింది. రుమేనియా భామ సిమోనా హలెప్‌తో 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ సమరంలో ఈ మాజీ చాంపియన్ పైచేయి సాధించింది. కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
పారిస్: మట్టి కోర్టులపై మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న ‘రష్యా బ్యూటీ’ మరియా షరపోవా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)తో నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో ఏడో సీడ్ షరపోవా 6-4, 6-7 (5/7), 6-4తో విజయం సాధించింది. 2007 నుంచి గతేడాది వరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రతి ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. అయితే ఆ ఆనవాయితీని 27 ఏళ్ల షరపోవా ఈసారి బ్రేక్ చేసింది.
2012లో తొలిసారి ఈ టైటిల్ నెగ్గిన షరపోవా కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో సిమోనాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన షరపోవాకు ఈసారి విజయం అంత సులభంగా లభించలేదు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సిమోనా... పదేళ్ల క్రితమే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన షరపోవా ప్రతి పాయింట్‌కూ పోరాడారు.
ఇద్దరూ కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్‌లు, బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతో అలరించారు. దాంతో ప్రతి గేమ్ సుదీర్ఘంగా సాగింది. మ్యాచ్ మొత్తంలో షరపోవా తన ప్రత్యర్థి సర్వీస్‌ను 9 సార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను 7 సార్లు కోల్పోయింది. 12 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేసినా... 46 విన్నర్స్‌తో షరపోవా మ్యాచ్ ఫలితాన్ని శాసించింది.
తాజా విజయంతో షరపోవా టెన్నిస్ క్రీడాకారిణుల ఆల్‌టైమ్ ప్రైజ్‌మనీ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. సెరెనా విలియమ్స్ (అమెరికా) అగ్రస్థానంలో ఉంది.
షరపోవా గెలిచిన ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సరిసంఖ్య సంవత్సరాల్లో (2004-వింబుల్డన్; 2006-యూఎస్ ఓపెన్; 2008-ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012, 2014-ఫ్రెంచ్ ఓపెన్) రావడం విశేషం.
2010 నుంచి క్లే కోర్టులపై మూడు సెట్‌లపాటు జరిగిన మ్యాచ్‌ల్లో షరపోవాకు పరాజయం ఎదురుకాలేదు. ఈ తరహా మ్యాచ్‌ల్లో ఆమెకిది వరుసగా 20వ విజయం కావడం విశేషం.
13 ఏళ్ల తర్వాత మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మూడు సెట్‌లపాటు జరిగింది. 2001లో జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా) 1-6, 6-4, 12-10తో కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం)పై గెలిచింది.