మెస్సీ.. ప్లీజ్ వెళ్లిపోవద్దు: మారడోనా
బ్యూనాస్ ఎయిర్స్: అర్జెంటీనా జట్టులో లియోనల్ మెస్సీ పోస్టర్ తరహా పాత్రకే పరమితమయ్యాడంటూ ఇటీవల విమర్శల వర్షం కురిపించిన ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కోచ్ డిగో మారడోనా తాజాగా స్వరం మార్చాడు. అర్జెంటీనా జట్టుకు మెస్సీ అవసరం చాలా ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుదిపోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన మెస్సీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పాడు. దీంతో మెస్సీ వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మారడోనా కోరాడు.
'మెస్సీ జట్టును విడిచి వెళ్లవద్దు. జట్టుకు నీ అవసరం ఉంది. జట్టు కోసం పూర్తి బాధ్యతతో ఆడని వారికి మాత్రమే వెళ్లిపోయే అవకాశం ఉంది. జట్టును ఉన్నతస్థానంలో నిలపడానికి నీవు చాలా చేశావు. దయచేసి జట్టును విడిచి వెళ్లకు. వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకో'అని మారడోన విన్నవించాడు.
ఇటీవల కాలంలో మెస్సీపై మారడోనా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా జట్టులో పోస్టర్ తరహా పాత్రను పోషిస్తూ ఫీల్డ్లో ఒక గొప్ప నాయకుడిగా మెస్సీ మన్ననలు అందుకుంటున్నాడంటూ మారడోనా విమర్శించాడు. అయితే ప్రస్తుతం అర్జెంటీనా జట్టుకు గుడ్ బై చెప్పిన మెస్సీ.. వచ్చే వరల్డ్ కప్(2018) నాటికి రష్యాకు వెళ్లి అక్కడ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెస్సీ జట్టుతోనే ఉండాలంటూ మారడోనాతో పాటు, పలువురు అర్జెంటీనా ఫుట్ బాల్ పెద్దలు విజ్ఞప్తి చేయడం గమనార్హం.