ముంబై: ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై 13 పరుగుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంకా మిగిలింది నాలుగు మ్యాచ్‌లే కావడంతో అన్నింటా విజయం సాధించాల్సిన పరిస్థితి ముంబైది. ఈ తరుణంలో జట్టులోని లోపాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మార్పు రావాలి: ‘‘ఇప్పటికైతే గెలిచాం కానీ.. మా బ్యాటింగ్ తీరు చాలా మారాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి అదనంగా 15-20 పరుగులు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. ఓపెనర్లు అద్భుతంగా రాణించినా, మేం అనుకున్న స్కోరును సెట్ చేయలేకపోయాం. ఛేజింగ్‌లో కోల్‌కతా తొలి 10 ఓవర్లు ఆడిన తీరు కొంత ఆందోళన కలిగించింది. కానీ ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్నారు. మొత్తానికి బౌలింగ్ యూనిట్ వల్లే గెలిచాం’ అని రోహిత్ అన్నాడు.
క్రెడిట్ నాకొద్దు: ‘‘మిడిల్ ఆర్డర్‌లోనూ మాకు ముగ్గురు పవర్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ సత్తాకు ఢోకాలేదు. ఎటొచ్చీ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడమే కావాల్సింది. టోర్నీలో ముంబై ఇండియన్స్ కథ ముగుస్తుందనుకున్న వేళ జట్టు సభ్యులంతా ఎంతో పట్టుదలతో ఆడి, ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా నిలిపారు. ఈ క్రెడిట్ నా ఒక్కడికే వద్దు. మా బాయ్స్ అందరి పాత్రా ఉంది. మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహాలో రాణిస్తామన్న నమ్మకం ఉంది’’ అని ముంబై సారధి పేర్కొన్నాడు.
తర్వాతి మ్యాచ్‌కూడా కోల్‌కతాతోనే: ఆదివారం నాటి మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై.. కోల్‌కతాపై గెలుపొందింది. కాగా, ముంబై తదుపరి మ్యాచ్ కూడా ఇదే ప్రత్యర్థితో తలపడనుంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. 10 పాయింట్లతో కోల్‌కతా 4వ స్థానంలో ఉండగా, ముంబై 8 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్, సీఎస్‌కే, కింగ్స్ పంజాబ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment