
క్లార్క్ అజేయ సెంచరీ
కేప్‌టౌన్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ (301 బంతుల్లో 161 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీ నమోదు చేయడంతో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 331/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్... వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది.
తొడ కండరాల గాయంతో తొలిరోజు అర్ధంతరంగా మైదానం వీడిన దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ స్టెయిన్ ఆదివారం కూడా బౌలింగ్‌కు దిగకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసీస్ చక్కగా సొమ్ము చేసుకుంది. అర్ధసెంచరీ సాధించిన స్టీవెన్ స్మిత్ (84; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు క్లార్క్ 184 పరుగులు జోడించాడు. ఎల్గర్ బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాక వాట్సన్ (40) దూకుడుగా ఆడగా, డుమిని (4/73) వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. టీ విరామం తరువాత వర్షం ప్రారంభమై ఎంతకీ తగ్గకపోవడంతో ఆ తరువాత ఆట సాధ్యం కాలేదు.