క్లార్క్ కు అగ్ని పరీక్ష!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అసలు సిసలు పరీక్ష ఎదుర్కొబోతున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ పోరులో కెప్టెన్ గా తొలిసారి లిట్మస్ టెస్ట్ పేస్ చేయబోతున్నాడు. 2011 వరల్డ్ కప్ లో ఇండియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో క్లార్క్ ఆడాడు. అయితే అప్పుడు అతడు కెప్టెన్ కాదు. అహ్మదాబాద్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోడంతో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
తాజా ప్రపంచకప్ లో జరగనున్న రెండో సెమీఫైనల్లో టీమిండియాతో క్లార్క్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే క్లార్క్ భవితవ్యం ప్రమాదం పడే అవకాశముంది. మరోవైపు యువ ఆటగాడు స్టీవ్ స్మిత్ నుంచి క్లార్క్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నాడు. గాయంతో క్లార్క్ జట్టుకు దూరమైనప్పుడు కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన స్మిత్ ఊహించిన దానికంటే ఎక్కువగా రాణించి మన్ననలు అందుకున్నాడు.
క్లార్క్ విఫలమైతే నాయకత్వ బాధ్యతలు స్మిత్ కు అప్పగించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. మిగతా ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా గురువారం ధోని సేనతో జరిగే మ్యాచ్ క్లార్క్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష లాంటిదేనని చెప్పక తప్పదు.