డబ్ల్యూహెచ్‌ఓ అంబాసిడర్‌గా మిల్కాసింగ్
డబ్ల్యూహెచ్‌ఓ అంబాసిడర్‌గా మిల్కాసింగ్
Published Fri, Aug 11 2017 4:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM
న్యూఢిల్లీ: ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కాసింగ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గుర్తింపు ఇస్తున్నట్లు పేర్కొంది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆయన.. ఈ ప్రాంతంలో అసంక్రామిక వ్యాధులను క్రీడలు, వ్యాయామాల ద్వారా తగ్గించే కార్యాచరణలో పాల్గొంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించేందుకు క్రీడలు, వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయనేందుకు 80 ఏళ్ల మిల్కాసింగ్ ఒక మంచి ఉదాహరణ అని సంస్థ పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో అసంక్రామిక వ్యాధుల కారణంగా ఏటా 8.5 మిలియన‍్ల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
రోజువారీ వ్యాయామాల ద్వారా వ్యాధులను అరికట్టడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటిని రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలోని 70 శాతం బాలురు, 80 శాతం బాలికలు ఎటువంటి ఆటలు, శారీరక వ్యాయామాలు చేయటం లేదని వివరించింది. 80 ఏళ్ల వయస్సుల్లోనూ ఆయన పరుగులో చురుగ్గా పాల్గొంటున్నారని మిల్కాసింగ్‌ను కొనియాడింది. ఆయన కృషితో ఈ ప్రాంతంలో వ్యాయామాలు, ఆటలపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆట స్థలాల అభివృద్ధి, పౌరులు వ్యాయామం చేసుకునేందుకు, ఆటలు ఆడుకునేందుకు తగిన పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వాలను కోరనున్నట్లు వెల్లడించింది.
Advertisement
Advertisement