'నా రిటైర్మెంట్ సమయం వచ్చేసింది'
సిడ్నీ:తన పదిహేనళ్ల క్రికెట్ కెరీర్కు ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నాడు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మిస్బా.. సిడ్నీలో జరిగే చివరిదైన మూడో టెస్టు తరువాత తన వీడ్కోలు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు మిస్బా తన మనుసులోని మాటను వెల్లడించాడు.
'నేను ఎప్పుడూ రిటైర్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగుతున్నా. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసింది అనుకుంటున్నా. నా రిటైర్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జట్టు అవసరాల కోసం ఆడకపోతే ఇక నేను అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆ క్రమంలోనే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. సిడ్నీ టెస్టుకు ముందుగానీ, ఆ తరువాత గానీ రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటా'అని మిస్బా పేర్కొన్నాడు.ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ను పాకిస్తాన్ ఇప్పటికే 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో తన రిటైర్మెంట్ గురించి ఆలోచనలో పడ్డాడు మిస్బా. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో మిస్బా దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేసిన మిస్బా.. రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా పెవిలియన్ చేరాడు.