ఆసీస్ కు మరో ఎదురుదెబ్బ
రాంచీ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ భారత్ తో సిరీస్ కు దూరం కాగా, తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా సిరీస్ నుంచి వైదొలిగాడు. స్టార్క్ కాలికి గాయం కావడంతో మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తెలిపింది. ఈ క్రమంలోనే స్టార్క్ స్వదేశానికి పయనం కానున్నాడు.
'బెంగళూరులో రెండు టెస్టులో స్టార్క్ కాలికి గాయమైంది. ఆ టెస్టు మ్యాచ్ లో స్టార్క్ కుడి కాలు స్వల్పంగా చిట్లడంతో విపరీతమైన బాధతో సతమతమయ్యాడు. దాంతో మిగతా రెండు టెస్టులకు స్టార్క్ అందుబాటులో ఉండటం లేదు.స్టార్క్ జట్టుకు దూరం కావడం నిజంగా మా దురదృష్టం. టెస్టు సిరీస్ కు స్టార్క్ పూర్తిగా అందుబాటులో ఉంటాడని తొలుత భావించినా అలా జరగలేదు. అతని కాలుకు తీయించిన స్కానింగ్ లో కొద్దిపాటి పగులు వచ్చినట్లు తేలింది. దాంతో అతను స్వదేశానికి వెళ్లక తప్పడం లేదు' అని సీఏ పేర్కొంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది.