స్టార్క్ వస్తున్నాడు జాగ్రత్త!
బ్రిస్బేన్: గతేడాది నవంబర్ నుంచి గాయం కారణంగా క్రికెట్ దూరంగా ఉంటున్న ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కరీబియన్లో జరిగే ముక్కోణపు సిరీస్కు సిద్ధమయ్యాడు. తాజాగా ఫిట్ నెస్ను నిరూపించుకోవడంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో జరిగే ట్రై సిరీస్లో స్టార్క్ అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగానే ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ముక్కోణపు సిరీస్లో స్టార్క్ బంతులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నాడు. ఈ సిరీస్లో స్టార్క్ కీలక పాత్ర వహించే అవకాశం ఉందని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు.
'సరికొత్త లుక్తో పదునైన ఆయుధాలతో స్టార్క్ వస్తున్నాడు. అతని బౌలింగ్లో రిథమ్ను తిరిగి అందిపుచ్చుకున్నాడు. స్టార్క్ రాకతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లలోని ఆటగాళ్లలో వణుకుపుట్టడం ఖాయం'అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలాఉండగా ఇప్పటివరకూ 46 అంతర్జాతీయ వన్డేలాడిన స్టార్క్ 90 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ విండీస్లో ముక్కోణపు సిరీస్ జరగనుంది.