ప్రపంచ రికార్డు చేరువలో మిథాలీ..
భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉంది.
డెర్బీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉంది. ఈ పరుగుల రాణి 34 పరుగులు చేస్తే మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల సాధించిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(5992) పేరిట ఉంది. ఈ ఘనత షార్లెట్ 191 మ్యాచుల్లో సాధించగా, మిథాలీ 181 మ్యాచుల్లో 5959 పరుగులు చేసింది.
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ చెలరేగితే అత్యధిక పరుగులతో పాటు తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన లేడిగా చరిత్రనెక్కనుంది. అంతేగాకుండా 6 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందనుంది. ఇక మిథాలీ చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తుంది. గత నాలుగు మ్యాచుల్లో 71, 46, 8, 53 లతో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక రేపు జరిగే మ్యాచులో రాణించి వరల్డ్ రికార్డుతో పాటు ప్రపంచ కప్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
మిథాలీకి రికార్డులు కొత్తేమి కాదు. ఆమె ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌పై మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇంత కాలం క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ, మహిళా టెస్టుల్లో 10 టెస్టులు ఆడటం ఆమె అదనపు రికార్డు.