
'మళ్లీ అతన్నిక్రికెట్ ఫీల్డ్ లోకి రానివ్వొద్దు'
లండన్: క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు , స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన వారిని తిరిగి జట్టులోకి స్వాగతించకూడదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి ఫిక్సింగ్ కు పాల్పడినా అది క్షమించరాని నేరమన్నాడు. గతంలో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ కు పాల్పడి ఐదేళ్లు నిషేధాన్ని పూర్తి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమిర్ ను ఉద్దేశించి పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2010 లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు (మహ్మద్ అమిర్, మహ్మద్ అసిఫ్, అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్)లు ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. అయితే అమిర్ పై నిషేధం తొలగి ప్రస్తుతం పోటీ క్రికెట్ లో పాల్గొంటున్నాడు.
ఏదో ఆశతో తప్పు చేసినా.. మన కుటుంబం ఆర్థికంగా వెనుక బడిన కారణంగా తప్పు చేసినా అది ఓ క్రీడను పూర్తిగా విచ్ఛిన్నపరచటానికి చేసేందేనని పీటర్సన్ తెలిపాడు. 'మహ్మద్ అమిర్, అసిఫ్ ల గురించి నాకు తెలుసు. ఆ ఇద్దరూ పేద కుటుంబం నుంచి వచ్చిన క్రీడాకారులు. పైగా టాలెంట్ ఉన్న ఆటగాళ్లు. వారి జీవితాలు ఎలా ఉన్నా నేను స్వాగతిస్తా. కొద్ది సెకండ్లు పాటు తప్పు చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక క్రీడలో ఉన్న హక్కును దోచుకోవాలనుకోవడం ముమ్మాటికీ పెద్ద నేరమే. అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టే అవకాశం ఇవ్వకూడదు. అమిర్ ను క్రికెట్ లోకి అనుమతించొద్దు' అని పీటర్సన్ తెలిపాడు.