
ఆమిర్ పై పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు
లండన్:గత ఆరు సంవత్సరాల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్పై జీవితకాలం నిషేధం విధించకుండా, మరో ఛాన్స్ ఎందుకు ఇచ్చిరంటూ విమర్శించాడు.
అసలు మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ పాల్పడిన వారిని మరోసారి ఆహ్వానిస్తే అది ఆటకు మచ్చగానే మిగిలిపోతుందని పీటర్సన్ స్పష్టం చేశాడు. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్కు, స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడితే జీవిత కాలం నిషేధం విధించడమే సరైన మార్గమన్నాడు. దాంతో పాటు డ్రగ్స్ తీసుకుని డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన మహిళా క్రికెటర్లపై కూడా జీవితకాల నిషేధం వేయాలన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే వారి జీవితంలో రెండో ఛాన్స్ కోరడం సహజమే. కానీ క్రీడల్లో రెండో అవకాశమనేదే ఉండకూడదని పీటర్సన్ ధ్వజమెత్తాడు. ఈ ప్రకారం చూస్తే ఆమిర్ రెండోసారి క్రికెట్ ఆడటానికి అనర్హుడన్నాడు.
ఇప్పటికే ఆమిర్ రాకను ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆమిర్ కు మద్దతుగా నిలుస్తుంటే, మాజీలు మాత్రం అతని పునరాగమనంపై మండిపడుతున్నారు.