
సాక్షి, న్యూఢిల్లీ: అసలే భార్య హసిన్ జహాన్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది. ఓ వైపు భారత క్రికెటర్ల కాంట్రాక్టు ప్యాకేజీలు భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన చేయగా.. షమీని మాత్రం తప్పించింది. తాజా కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో ఏ కేటగిరిలోనూ బౌలర్ షమీ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయాలబారిన పడుతున్నా నిలకడైన ప్రదర్శనతో కీలక సిరీస్‌లకు షమీ ఎంపికయ్యేవాడు. కానీ నేడు పునరుద్ధరించిన తాజా కాంట్రాక్టులో మాత్రం షమీకి మొండిచేయి లభించింది. వ్యక్తిగతంగానే కాదు, వృత్తిగతంగానూ షమీకి బుధవారం ఏమాత్రం కలిసిరాలేదు.
తన భర్త షమీకి చాలామంది యువతులు, మహిళలతో వివాహాతేర సంబంధాలున్నాయంటూ ఆయన భార్య హసిన్ జహాన్ ఈ క్రికెటర్‌కు షాకిచ్చారు. అతడో శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం వేధిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ వైవాహిక బంధాన్ని తెంచుకునే ప్రసక్తే లేదని, భర్తను కోర్టుకు లాగుతానని జాతీయ మీడియాకు తెలిపారు. భర్త సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు యువుతులు, మహిళల వివరాలు, ఫోన్ నెంబర్లను ఆమె సోషల్ మీడియాలో సైతం పోస్టు చేయడం కలకలం రేపింది. కాగా, కెరీర్ పరంగా తనను దెబ్బతీసేందుకు కొందరు ఈ కుట్ర పన్నారని.. భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు క్రికెటర్ షమీ.
‘షమీని ఏ దురుద్దేశంతోనూ కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించలేదు. క్రికెటర్ల కాంట్రాక్టులు రూపొందించిన రోజే షమీ భార్య అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే షమీ భార్య ఆరోపణలకు, షమీ కాంట్రాక్ట్ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదు. మా నిర్ణయం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండొచ్చునని కూడా చర్చించుకున్నామని’ బీసీసీఐ సభ్యుడొకరు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment