కోల్‌కతా: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో భర్తపై కేసు పెట్టింది భార్య హసీన్ జహాన్. ఈ మేరకు విచారణకు షమీ వ‍్యక్తిగతీంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో కోల్‌కతా కోర్టు ఆగ్రహం చేసింది. దీనిపై జనవరి 15 లోపు షమీ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని నోటీసులు జారీ చేసింది.
షమీ అతని భార్య హసీన్ మధ్య కొద్దికాలం కింద మనస్పర్థలు రావడం.. తన భర్తకు చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని.. అతనిపై గృహ హింస కేసు పెట్టడంతో వీరి బంధం బీటలు వారింది. ప‍్రస్తుతం విడిగా ఉంటున్న వీరిద్దరూ.. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
అయితే హసీన్ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం షమీ ప్రతినెల చెక్కు పంపిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఇచ్చిన చెక్కు డ్రా అవ్వకుండా షమీ కావాలనే ఆపాడని హసీన్ ఎన్ఐ చట్టం కింద కోల్‌కతాలోని అలిపోర్ కోర్టులో కేసు వేసింది.
దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా షమీకి న్యాయస్థానం నోటీసులు పంపింది. అయినప్పటికి అతను స్పందించలేదు. దీంతో బుధవారం జరిగిన విచారణకు రావాల్సిందిగా అక్టోబర్‌లో మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది.. దీనికి షమీ హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి జనవరి 15లోపు ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment